బోధన్ రూరల్, మార్చి 9: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాక ముందు పల్లెల్లో సమాచారం చాటింపు(దండోరా) ద్వారా తెలియజేసేవారు. వీధుల గుండా తిరుగుతూ డప్పు కొడుతూ గట్టిగా చాటింపు వేయగా, ఇండ్ల నుంచి గ్రామస్తులు బయటికి వచ్చి వినేవారు. గ్రామానికి సంబంధించి ఏ విషయమైనా ఇలా చాటింపు ద్వారా ప్రజలకు చేరవేసేవారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ చేతిలో ఫోన్ రావడంతో ఎక్కడ ఏం జరిగినా సమాచారం క్షణాల్లో చేరుతున్నది. ఫోన్ ఒక విధంగా సమాచార సాధనంగా మారింది.
అయితే బోధన్ డివిజన్లోని కొన్ని పల్లెల్లో ఇప్పటికీ డప్పు చాటింపు కొనసాగుతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడంతో కుల వృత్తులకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో డప్పు చాటింపు పద్ధతిని ఇప్పటికీ పల్లెల్లో కొనసాగిస్తుండడం విశేషం. పల్లెల్లో టాం..టాం శబ్దం వినగానే ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చి సమాచారాన్ని వింటున్నారు. హడావుడిలో వినని వారు డప్పు చాటింపు చేసే వ్యక్తిని పిలిచి మరీ అడిగి విషయం తెలుసుకుంటారు. గ్రామాల్లో సమావేశాలు, అధికారుల పర్యటనలు, పండుగ విశేషాలు, ప్రభుత్వ పథకాల వంటి తదితర సమాచారం డప్పు చాటింపు ద్వారా ప్రకటిస్తున్నారు