సోమవారం 25 జనవరి 2021
National - Dec 24, 2020 , 12:19:10

న్యుమోనియాకు తొలి స్వదేశీ టీకా.. త్వరలో అందుబాటులోకి..

న్యుమోనియాకు తొలి స్వదేశీ టీకా.. త్వరలో అందుబాటులోకి..

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా నిలిచిన భారతదేశం తొలిసారిగా న్యుమోనియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మొదటి టీకాను తయారు చేసింది. త్వరలో టీకాను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ విడుదల చేయనున్నారు. దేశంలో న్యుమోనియా వ్యాక్సిన్లు వాడుకలో ఉన్నా.. అవి విదేశీ సంస్థలకు చెందినవే. స్థానికంగా అభివృద్ధి చేస్తున్న ఈ టీకాతో విదేశీ కంపెనీలకు చెందిన వాటి కంటే చౌకగా ఉండనుంది. సీరం ఇనిస్టిట్యూట్‌ సమర్పించిన ఒకటి, రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను సమీక్షించిన తర్వాత జూలైలో భారత డ్రగ్‌ కంట్రోల్‌ సంస్థ న్యూమోకాక పాలిసాకరైడ్ కంజుగేట్ వ్యాక్సిన్‌ను మార్కెట్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. శిశువుల్లో ‘స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా’ వల్ల కలిగే ఇన్వాసివ్ డిసీజ్, న్యుమోనియాకు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తి కోసం వ్యాక్సిన్‌ను ఉపయోగించనున్నట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. సీరం వ్యాక్సిన్‌ ఒకటి, రెండు, మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌ను భారత్‌తో పాటు ఆఫ్రికాదేశమైన గాంబియాలో జరిగాయి. ‘న్యుమోనియా’ రంగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి టీకా ఇదేనని అధికార వర్గాలు తెలిపాయి.


ఇది ప్రధాని మేకిన్‌ ఇండియా కలలను నెరవేర్చడంలో తమ ప్రయత్నమని, భారతదేశ మొట్టమొదటి ప్రపంచ స్థాయి స్వదేశీ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)ను అభివృద్ధి చేసి, లైసెన్స్ పొందడం ద్వారా కొవిడ్‌-19 మహమ్మారి లాక్‌డౌన్‌ కాలంలో మరో చారిత్రక మైలురాయిని సాధించామని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల అదనపు డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ ఆరోగ్యశాఖ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. యునిసెఫ్ గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం దేశంలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఒక లక్ష మంది పిల్లలు న్యుమోనియా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. న్యుమోనియా అనేది శ్వాస సంబంధిత వ్యాధి ప్రస్తుత కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్స్ (పీసీవీ) ఉన్న పిల్లలకు టీకాలు వేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అధికారిక వర్గాలు తెలిపాయి. దేశం ప్రస్తుతం చాలా ఎక్కువ ధరకు విదేశీ తయారీదారుల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొన్నాయి.


logo