F-35 fighter jet : ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets) లో ఒకటైన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది. ఈ యుద్ధ విమానం బ్రిటన్ దేశానికి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రయిక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఆ హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ ఇటీవల ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత నేవీతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేసింది.
బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఆ నౌకలోని యుద్ధ విమానం ఎఫ్-35 ఇంధనం తగ్గడంతో ఆదివారం తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని ముందుగా వార్తలు వినిపించాయి. కానీ 72 గంటలు గడిచినా విమానం ఇంకా అక్కడే ఉంది. ఆ ఫైటర్‌జెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంవల్లే జెట్ నిలిచిపోయిందని తెలిసింది.
ఆ ఫైటర్ జెట్‌లో సమస్యను సరిచేసిన తర్వాత తిరిగి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పైకి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫైటర్జెట్కు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్నది. మన దేశంలో ఓ విదేశీ యుద్ధ విమానం రెండు రోజులపాటు నిలిచిపోవడం, అందులోనూ ఎఫ్-35 లాంటి 5వ తరం స్టెల్త్జెట్ మోరాయించడం సాధారణ విషయం కాదు.
కాగా ఈ విమానం షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా దీనిలోనే మరో వేరియంట్ విమానాన్ని ఇరాన్‌పై దాడులకు వాడుతున్నది.