Heart Diseases In Women | సాధారణంగా గుండె జబ్బులు పురుషులకే ఎక్కువగా వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో మహిళల్లో కూడా గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్ 19 తరువాత మహిళల్లో మరణాలకు ప్రధాన కారణం ఇస్కీమిక్ హార్డ్ డిసీజ్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిని కరోనరీ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు. కరోనరీ ఆర్టరీల్లో ప్లాక్ అనే కొవ్వు పదార్థం పేరుకుపోవడం వల్ల ఆర్టరీలు సన్నగా మారి గుండెకు సరిగ్గా రక్తాన్ని సరఫరా చేయలేవు. ఈ ప్లాక్ లో ఒక భాగం విడిపోయి గడ్డగా ఏర్పడితే, అది ఆర్టరీని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. దీంతో గుండె కండరాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి హార్ట్ ఎటాక్ వస్తుంది. మహిళలు ఎక్కువగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి మరింత తీవ్రమై మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
అలాగే పురుషుల మాదిరి మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపించవు. అధిక అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, మెడ, వెన్నెముకలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలను చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, జీర్ణ సమస్యల కారణంగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే మహిళల్లో ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ రావడానికి గల ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టరీలు సులభంగా విస్తరించడానికి, రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుపోకుండా చేయడంలో, రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఈస్ట్రోజన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ మోనోపాజ్ దశ తరువాత ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది. దీంతో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, రక్తపోటు పెరగడం, చెడు కొలెస్ట్రాల్ పెరగడం, ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు పెరగడం జరుగుతుంది. దీంతో గుండె జబ్బులు వంటి ప్రమాదాలు ఎక్కువవుతాయి.
హైబీపీ వల్ల రక్తనాళాల గోడలపై నిరంతరం ఒత్తిడి పడుతుంది. దీంతో ఆర్టరీలు క్రమంగా దెబ్బతింటాయి. మెనోపాజ్ తరువాత ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. హైబీపీ కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాలు మరింతగా పెరుగుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువవడం వల్ల ఆర్టరీలలో ప్లాక్ పేరుకుపోతుంది. దీంతో రక్తప్రసరణ తగ్గి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా అధిక బరువు, శారీరక చలనం లేకపోవడం వల్ల హైబీపీ, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలన్నీ కూడా గుండె ప్రమాదాలను పెంచుతాయి. ధూమపానం వల్ల రక్తనాళాల గోడలు బలహీనంగా తయారవుతాయి. వాపు పెరగడంతో పాటు రక్తనాళాల్లో ప్లాక్ త్వరగా పేరుకుపోతుంది. దీంతో గుండె సమస్యల ప్రమాదం మరింత ఎక్కువవుతుంది. ఇలా అనేక కారణాల వల్ల మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు.
అయితే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ చికిత్స వ్యాధి తీవ్రత, ఆర్టరీల్లో ఉన్న బ్లాకేజ్ పై ఆధారపడి ఉంటుంది. కనుక వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడే గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండడం వంటివి చేయాలి. వ్యాధిని సరైన సమయంలో గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యంతో పాటు జీవన నాణ్యతను కూడా గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.