కోదాడ, మార్చి 10 : పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు క్రమం తప్పకుండా ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పారిశుధ్యలోప నివారణకు ప్రజల సహకరించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఆయా వార్డుల్లో పర్యటించి చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరచడం, రోడ్లను శుభ్రంగా ఉంచడం వంటి పారిశుద్ధ కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
అనంతరం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. కష్టపడి చదివితేనే ఉన్నత అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో తనిఖీ నిర్వహించి పెండింగ్లో ఉన్న ఫైళ్లను పరిష్కరించాలని సూచించారు. విద్య, వైద్యం అంశాలపై ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఆర్డీఓ సూర్యనారాయణ. ఎంఈఓ సలీం షరీఫ్, 21వ వార్డు కౌన్సిలర్ కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు సుశీల, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.