రామగిరి, మార్చి 10 : వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ అధ్యక్షతన బ్రహ్మశ్రీ దివ్య జ్ఞాన సిద్ధాంతి రచించిన పరాభవ నామ సంవత్సర తెలంగాణ రాష్ట్ర పంచాంగం ను నల్లగొండ పట్టణ కేంద్రంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ, యాదగిరిగుట్ట విశ్రాంతి ప్రధాన అర్చకులు కారంపూడి నరసింహాచార్యులు, నల్లగొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.భాస్కర్, లక్ష్మీనారాయణ సేవా సమితి దివ్య రామన చక్రవర్తులు, రుద్రవీణ పత్రిక సంపాదకులు బాలసుబ్రమణ్యం, అర్చక ఉద్యోగ జేఏసీ నాయకులు డివిఆర్ శర్మ, ధూప దీప నైవేద్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండోజు నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్చక సంక్షేమానికి, దేవాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ సమస్త మానవాళికి శ్రేయస్సు జరగాలని ఆయన ఆకాక్షించారు. నగర మేయర్ చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణులందరూ తమ వేదమంత్రాలతో సమాజ హితం కోసం పూజలు చేయాలని, బ్రాహ్మణ ఆశీస్సులతో నల్లగొండ నగరాన్ని ఈ పరాభవ నామ సంవత్సరంలో అభివృద్ధి వైపు పయనింపజేస్తామన్నారు. అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ మాట్లాడుతూ.. ధూప దీప నైవేద్య అర్చకులకు సమన్యాయం జరగాలని అర్చక ఉద్యోగ జేఏసీ కృషి చేస్తుందన్నారు. వారి వేతన సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధూప దీప నైవేద్య “స్కీం” అనే పదాన్ని తొలగించి పూర్తిస్థాయిలో దేవాదాయ శాఖ పరిధిలో తీసుకురావడం వల్ల డీడీఎన్ అర్చకులకు పే స్కేల్స్ రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ