Crime news : ఓ హత్య కేసులో మృతుడి తొమ్మిదేళ్ల కుమారుడే ప్రత్యక్ష సాక్షి అయ్యాడు. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. హత్య జరిగిన గదిలోనే పడుకున్న బాలుడు నిద్రపోయినట్టు నటిస్తూ ఆ హత్యను కళ్లారా చూశాడు. ఆ తర్వాత తన భర్త అనారోగ్యంతో మరణించాడని తల్లి చెప్పగా.. తల్లే తన తండ్రిని హత్య చేయించిందని బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్ (Rajasthan) లోని అళ్వార్ (Alwar) జిల్లాలో పది రోజుల క్రితం జరిగిన ఈ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. అళ్వార్‌లోని ఖెర్లీ ఏరియాకు చెందిన మాన్ సింగ్ జాతవ్, అనితి ఇద్దరూ భార్యాభర్తలు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో అనితకు ఖాసీరామ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనిత కిరాణం దుకాణం నడుపుతుండగా.. అక్కడే ఖాసీరామ్ కచోరీలు అమ్ముతుంటాడు.
ఈ క్రమంలో వారి వివాహేతర బంధానికి అడ్డులేకుండా మాన్సింగ్ జాతవ్‌ను చంపేయాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. అనుకున్న ప్రకారం ఈ నెల 7న అర్ధరాత్రి ఖాసీరామ్ మరో ముగ్గురు కిరాయి హంతకులను తీసుకుని అనిత ఇంటికి వచ్చాడు. అప్పటికే మాన్సింగ్, అతని కుమారుడు వేర్వేరు మంచాల్లో నిద్రపోతున్నారు. తలుపు చప్పుడుకు బాలుడికి మెళుకువ వచ్చినా.. ఏదో జరుగుతుందని గ్రహించి భయంతో నిద్రనటించాడు.
దాంతో నిందితులు కూడా బాలుడు నిద్రలో ఉన్నాడని భావించి.. మాన్సింగ్ ముఖంపై దిండుతో అదిమి ఊపిరిరాడకుండా చేసి చంపారు. ఆ సమయంలో మాన్సింగ్ ఏమాత్రం కదలకుండా నలుగురు అదిమి పట్టుకున్నారు. హత్యను కళ్లారా చూసిన బాలుడు భయంతో ఏడవడంతో ఖాసీరామ్ బెదిరించి నోరు మూయించాడు. ఆ తర్వాత మాన్సింగ్ భార్య తన భర్త ఉన్నట్టుండి మంచంలో పడి చనిపోయాడని ఇరుగుపొరుగుకు చెప్పింది.
దాంతో ఇరుగుపొరుగు వచ్చి మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ చేస్తుండగా.. మృతుడి కుమారుడు జరిగింది చెప్పాడు. ఖాసీ అంకుల్ మరో ముగ్గురు కలిసి మా నాన్నను చంపారని, అప్పుడు మా అమ్మ అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయిందని తెలిపాడు. దాంతో పోలీసులు అనితను, ఆమె ప్రియుడు ఖాసీరామ్ను అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.