ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 21:03:54

2021 అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసిన మమతా

2021 అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసిన మమతా

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వచ్చే ఏడాది రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. అందుకు ఇప్పటినుంచే కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. రానున్న ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించేవారిని గుర్తించి అందలం ఎక్కిస్తున్నారు. ఇప్పటినుంచే అభ్యర్థులను ఎంపికచేసే పనిలో పడ్డారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు చక్కటి వ్యూహాలను రూపొందించడానికి ఏడుగురు సభ్యుల కోర్ కమిటీని మమతా దీదీ ఏర్పాటుచేశారు. కొత్తగా ఏర్పడిన ప్యానెల్‌లో అభిషేక్ బెనర్జీ, ఫిర్హాద్ హకీమ్, షువేండు అధికారి, కల్యాణ్ బెనర్జీ, సుబ్రతా బక్షి, పార్థా ఛటర్జీ, శాంత ఛెత్రి ఉన్నారు. బక్షిని కమిటీ కన్వీనర్‌గా నియమించగా.. అభిషేక్ బెనర్జీని తృణమూల్ యూత్ వింగ్ అధ్యక్షుడిగా కొనసాగించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ తన ప్రత్యర్థి బీజేపీ చేతిలో ఓడిపోయిన ప్రాంతాల్లో పార్టీ జిల్లా నాయకత్వంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. షెడ్యూల్డ్ తెగ వర్గాలకు చెందిన నాయకులకు కూడా పార్టీలో అవకాశం కల్పించారు. లాల్‌గఢ్‌ ఉద్యమానికి ముఖ్య నేతగా ఉన్న గిరిజన నాయకుడు ఛత్రాధర్ మహాటోపాటు చురమణి మహాటో, సుకుమార్ హన్స్‌డాలను రాష్ట్ర కమిటీలోకి చేర్చారు.

ఇదిలావుండగా లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాను నడియా జిల్లా అధ్యక్షుడిగా నియమించగా.. రాష్ట్ర క్రీడా మంత్రిగా ఉన్న మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లాకు హౌరా టౌన్ ఏరియా బాధ్యతలు అప్పగించారు. హౌరా గ్రామ ప్రాంతానికి నూతన అధ్యక్షుడిగా యంగ్ ఫేస్ పులక్ రాయ్ ఎంపికయ్యారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా అధ్యక్షుడిగా రాజ్యసభ ఎంపీ అర్పితా ఘోష్ స్థానంలో గౌతమ్ దాస్ నియమించారు.


logo