Bihar Polls | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది (Assembly Elections). కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ గురించి ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar) బీహార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరుగుతుందని సీఈసీ వెల్లడించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాతే వీవీ ప్యాట్, ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. బీహార్ ఎన్నికల షెడ్యూల్తోపాటూ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీ ఏర్పడిన అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ప్రకటించారు.
243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి నవంబర్ 22తో గడువు ముగియనుంది. ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన ఈసీ.. గడువులోగా ఎన్నికలు పూర్తిచేస్తామని ఇప్పటికే ప్రకటించింది. కాగా, 2020లో జరిగిన ఎన్నికల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగగా.. అంతకుముందు ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. బీహార్లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. సెప్టెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రచురించింది.
కాగా, ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, పారదర్శకత కోసం తీసుకొచ్చిన 17 సంస్కరణలను బీహార్ ఎన్నికల నుంచే అమలు చేయనుంది. వీటిలో పోలింగ్ సందర్భంగా కొన్ని, ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని అమలవుతాయి. ఇకపై ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండరు. ప్రస్తుతం 1,500 మంది ఓటర్లు ఉంటున్నారు. తాజా సవరణతో బీహార్లో ప్రస్తుతమున్న 77,895 పోలింగ్ కేంద్రాలు 90,712కి పెరుగనున్నాయి.
ఈవీఎంలపై తొలిసారి కలర్ ఫోటోల(EVMs Color Photso)ను ప్రచురించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు చెందిన కలర్ ఫోటోలు, పేర్లు ఈవీఎం మెషీన్లపై ఉంటాయి. అభ్యర్థులను గుర్తించేందుకే ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి ఫిర్యాదులకైనా 1950 నెంబర్కు ఓటర్లు డయల్ చేయొచ్చని సీఈసీ తెలిపారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ద్వారా జరిగే అనేక కొత్త మార్పులను సీఈసీ ఇవాళ వెల్లడించారు.
🗓️#SCHEDULE for the GENERAL ELECTION TO THE LEGISLATIVE ASSEMBLY OF BIHAR 2025 – Two Phases
Details 👇#Bihar #BiharElections2025 pic.twitter.com/ZeTBbpX32O
— Election Commission of India (@ECISVEEP) October 6, 2025
Also Read..
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. ఎలక్షన్స్ ఎప్పుడంటే..
EVMs Color Photos: ఈవీఎంలపై తొలిసారి కలర్ ఫోటోలు.. ఈసీఐనెట్ యాప్లో ఓటింగ్ డేటా
Nallavagu | కుండపోత వర్షం.. నల్లవాగు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద