న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయడంపై స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికార పరిధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రివ్యూ పిటిషన్లను విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కూడా అయిన కపిల్ సిబల్ శనివారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో ఈడీ చర్య వెనుక ఏకైక ఉద్దేశం ప్రతిపక్ష నాయకులను వేధించడమేనని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, బీహార్‌లో లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్‌లపై ఈడీ చర్యలను ఆయన ఉదాహరించారు. పశ్చిమ బెంగాల్లో ఐ-ప్యాక్‌పై రైడ్ తర్వాత ఈడీ ఏమి దర్యాప్తు చేస్తుందని ప్రశ్నించారు. ఆ సంస్థకు చెందిన అన్ని పత్రాలు తీసుకునే హక్కు ఈడీకి లేదన్నారు.
కాగా, తప్పుడు సమాచారం ఆధారంగా ఏ రాజకీయ పార్టీని గానీ, నాయకుడిని గానీ గత యూపీఏ ప్రభుత్వం విచారించలేదని, వేధించలేదని మాజీ కేంద్ర మంత్రి అయిన కపిల్ సిబల్ గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఈడీకి ఎప్పుడూ ఇలాంటి స్వేచ్ఛ ఇవ్వలేదని చెప్పారు.
మరోవైపు యూపీఏ హయాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏర్పడినప్పుడు దేశంలో ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లగల సర్వవ్యాప్త ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అని తమకు తెలియదని కపిల్ సిబల్ తెలిపారు. ‘ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టి, వారి ప్రభుత్వాలను కూల్చివేయడం ద్వారా సమాఖ్య వ్యవస్థపై కూడా ఈడీ దాడి చేయగలదు. అది సమర్థనీయమైనా కాకపోయినా’ అని ఎద్దేవా చేశారు.
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలపై తాను బాధపడినట్లు కపిల్ సిబల్ తెలిపారు. ‘దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలగాలని నేను కోరుకోవడం లేదు’ అని అన్నారు. దర్యాప్తు సంస్థల అధికార పరిధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమీక్ష పిటిషన్లను విచారించనందుకు సుప్రీంకోర్టును తప్పుపట్టారు. ‘అన్ని సమస్యలను సుప్రీంకోర్టు పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే సమాఖ్య వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ప్రజలకు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు.
Also Read:
ED moves Supreme Court | ఐ-ప్యాక్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
Dalit Woman Murdered, Daughter Kidnapped | దళిత మహిళను హత్య చేసి.. ఆమె కుమార్తెను కిడ్నాప్