Khalistani terrorist | కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani terrorist), నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) మరోసారి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. నవంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో ప్రయాణించొద్దని వార్నింగ్ ఇచ్చాడు.
భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 1 నుంచి 19వ తేదీ వరకూ ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో తెలిపాడు. దేశంలో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పన్నూన్ హెచ్చరికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఇక పన్నూన్ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు. గతేడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.
కాగా, నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూసివేస్తారని పన్నూన్ తెలిపాడు. భవిష్యత్తులో ఆ విమానాశ్రయం పేరు కూడా మారుతుందని అన్నాడు. అలాగే నవంబర్ 19న జరుగనున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ ‘ఈ నవంబర్ 19, ప్రపంచ టెర్రర్ కప్ ఫైనల్‌తో సమానంగా ఉంటుంది’ అని ఆ వీడియోలో బెదిరించాడు.
Also Read..
Donald Trump | మెక్‌డొనాల్డ్స్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసిన ట్రంప్.. వీడియో వైరల్
Jammu And Kashmir | జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం వెనుక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ప్రమేయం
PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాదీపంగా పనిచేస్తోంది: ప్రధాని మోదీ