Donald Trump : అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా అమెరికా (USA) లోని లాస్ ఏంజిల్స్ (Los angeles) లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఆ అరెస్టులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న ఆ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా త్వరలోనే ఓ ఉత్తర్వు జారీ చేస్తానని ట్రంప్ ఇటీవల ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా లాస్ ఏంజిల్స్‌లోని వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిలిపివేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని ఓ సీనియర్ అధికారి కూడా వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లలో తనిఖీలను వెంటనే ఆపేయాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
కాగా అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు ఐసీఈ అధికారులు గత శుక్రవారం లాస్ ఏంజిల్స్‌లోని డౌన్టౌన్లో సోదాలు ప్రారంభించడంతో నిరసనలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆ నిరసనలు దేశమంతటా విస్తరించాయి. ఈ క్రమంలో లాస్ ఏంజిల్స్‌లో ట్రంప్ భారీ స్థాయిలో నేషనల్ గార్డులను మోహరించారు. దాంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిరసనకారులను అడ్డుకునేందుకు మరో రెండు వేల మంది నేషనల్ గార్డులను మోహరించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ చర్యను కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్తోపాటు స్థానిక పోలీసు అధికారులు వ్యతిరేకించారు. గవిన్ దీనిపై ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అధ్యక్షుడి ఆదేశాలు చెల్లవని న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.