Dense Fog | దేశ రాజధాని ఢిల్లీని ప్రమాదకరమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. అతిసమీపంలో వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తీవ్ర పొగమంచు నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ఫాగ్ లైట్లను ఉపయోగించాలని సూచించింది. అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని హెచ్చరించింది.
పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే దాదాపు 128 విమానాలు ఆలస్యంగా (Flights Cancelled) నడుస్తున్నాయి. అందులో 64 అరైవల్స్ కాగా, 64 డిపార్చర్స్ ఉన్నాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు విమాన స్టేటస్‌ను చెక్‌చేసుకోవాలని సూచించింది. మరోవైపు విమానాల రద్దు, ప్రయాణ సమయాల్లో మార్పుల గురించి తెలుసుకోవడానికి తమ అధికారిక వెబ్సైట్లను తనిఖీ చేయాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. మరోవైపు.. పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్, వందేభారత్, జన శతాబ్దితో సహా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (Air Quality Index) ప్రమాదకరస్థాయిలో నమోదైంది. నగరంలో ఓవరాల్ ఏక్యూఐ లెవెల్స్ 402గా నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. నగరంలోని 40 ఎయిర్ మానిటరింగ్ కేంద్రాల్లోని 25 కేంద్రాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు గాలి నాణ్యత సూచిక తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. వివేక్ విహార్‌లో అత్యధికంగా 460గా నమోదైంది. ఆనంద్ విహార్ (459), రోహిణి (445), వజీర్‌పూర్‌లో 444గా ఏక్యూఐ లెవెల్స్ నమోదయ్యాయి.
Also Read..
Rabies | రేబిస్‌తో గేదె మృతి.. భయంతో 200 మంది గ్రామస్తులకు వ్యాక్సిన్లు
బెంగాల్ ఎన్నికల చీఫ్‌కు వై-ప్లస్ భద్రత