Rabies | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుదౌన్ జిల్లాలో రేబిస్ వ్యాధి కలకలం సృష్టించింది. పిప్రౌలి గ్రామంలో రేబిస్ వ్యాధితో ఓ గేదె మృతిచెందడం భయాందోళనలకు గురిచేసింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆ గ్రామంలోని 200 మందికి యాంటీ రేబిస్ టీకాలు వేశారు.
పిప్రౌలి గ్రామంలో డిసెంబర్ 23వ తేదీన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామస్తులకు భోజనంలో రైతా వడ్డించారు. అయితే ఆ రైతా తయారీకి వాడిన పాలు మొత్తం అదే గ్రామానికి చెందిన ఓ గేదెవి. ఆ గేదెను కొద్దిరోజుల ముందు ఓ కుక్క కరిచింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 26వ తేదీన ఆ గేదె అకస్మా్త్తుగా మరణించింది. అయితే గేదె మరణించడానికి ముందు దానిలో రేబిస్ లక్షణాలు కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. చనిపోయిన ఆ గేదె పాలతో తయారుచేసిన రైతా తిన్న వారికి కూడా రేబిస్ సంక్రమించే ప్రమాదం ఉందని భావించి, వారందరికీ యాంటీ రేబిస్ టీకాలు వేశారు. ప్రస్తుతం గ్రామస్తులు ఎవరికీ రేబిస్ లక్షణాలు లేవని.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే యాంటీ రేబిస్ టీకాలు వేసినట్లు వైద్యులు తెలిపారు.