బెంగళూరు, డిసెంబర్ 28 : అచ్చేదిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు పాలనలో దేశం తిరోగమనం చెందుతున్నది. నయాభారత్, వికసిత్ భారత్ అంటూ ప్రధాని, బీజేపీ పరివారం ఆర్భాటపు ప్రకటనలు చేస్తుండగా, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దేశంలో వేలాది కంపెనీలు మూతపడుతున్నాయి. లక్షలాది మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వలస వెళ్లిపోతున్నారు. దేశాన్ని నైపుణ్యాల రాజధానిగా మారుస్తానన్న మోదీ.. ఆచరణలో మాత్రం చిన్న బోల్టు, నట్టు కూడా విదేశాల నుంచే తెప్పించుకుంటూ దిగుమతుల దేశంగా భారత్‌ను మార్చేశారు. మేకిన్ ఇండియా స్ఫూర్తితో భారత్‌లో ఇండస్ట్రీలు స్థాపించిన చిన్న, మధ్య తరగతి పారిశ్రామికవేత్తలు అధికారుల నిబంధనలు, పన్ను విధానాలను తట్టుకోలేక గిలగిల్లాడుతున్నారు. ‘బాబోయ్ ఈ పన్ను విధానాలు, అధికారుల వేధింపులు భరించలేకపోతున్నా.. వచ్చే ఏడాది నేను విదేశాలకు వెళ్లిపోతున్నా’ అంటూ తాజాగా బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త చేసిన ప్రకటన తాజా పరిస్థితికి అద్దం పడుతున్నది.
భారత్‌లోని లోపభూయిష్ట వ్యాపార వ్యవస్థతో విసిగి వేసారి బెంగళూరుకు చెందిన రోహిత్ ష్రాఫ్ అనే వ్యాపారవేత్త వచ్చే ఏడాది భారత్‌ను విడిచి వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు. దేశంలో విధిస్తున్న భారీ పన్నులు, నిబంధనలకు లోబడి ఉన్నా పన్ను చెల్లింపుదారులపై నిఘా కారణంగా తాను భారత్‌ను వదిలి వెళ్లిపోదామనుకుంటున్నట్టు తెలిపారు. తాను గత 18 నెలలుగా రూ.4 కోట్లను పన్నుగా చెల్లించానని, అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కానీ, గుర్తింపు కానీ లభించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ వ్యాపార వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, ఈ పన్నుల వ్యవస్థ చిన్న గ్రూపులను లక్ష్యంగా చేసుకుందని లింక్డ్ ఇన్ పోస్ట్‌లో ఆరోపించారు. నీతిగా, నిజాయితీగా పూర్తి మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నా వారిని నిత్యం ఎందుకు అనుమానంగా చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
దేశంలో 5 శాతం మంది మాత్రమే ప్రత్యక్ష ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారని, అయినప్పటికీ వారు పదేపదే పరిశీలన, నిఘాను ఎదుర్కొంటున్నారని రోహిత్ ష్రాఫ్ ఆరోపించారు. వీరినే లక్ష్యంగా చేసుకుని జీఎస్టీ, ఆదాయపు పన్ను అధికారులు నోటీసులు, వివరణలు తరచూ పంపుతున్నారన్నారు. వారి నోటీసులు, వివరణలకు సమాధానం చెపుతుండటం వల్ల డబ్బు, కాలం కూడా వృథా అవుతున్నదన్నారు. ఈ వ్యవస్థ వ్యాపారాన్ని సులభతరం చేయడం లేదని, లేనిపోని నిబంధనలతో వ్యాపారవేత్తలను సంక్షిష్ట పరుస్తున్నదని అన్నారు. విదేశాల్లో చాలామంది భారతీయులు విజయం సాధించడానికి వారిని వెనక్కి లాగే వ్యవస్థలు లేకపోవడమేనని, దానికి విరుద్ధంగా భారత్‌లో వృద్ధిని ప్రోత్సహించడానికి బదులు, వారిని తమ నిబంధనలతో దారుణంగా దెబ్బతీస్తున్నాయన్నారు.
భారత దేశ పౌరసత్వం వదులుకున్న వారిలో 2020లో 85,256 మంది ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 2,06,378కి చేరకుంది. గత 14 ఏండ్లలో 20,86,037 మంది భారతీయులు సుమారు 135 దేశాలకు వలస వెళ్లిపోవడమే కాక, భారత పౌరసత్వాన్ని వదులుకుని అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేవలం నలుగురైదుగురు బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానే ప్రభుత్వ విధానాలు చేపట్టడం, మిగిలిన వారిని వేధించే విధంగా అధికారులు, నేతలు, ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుండటం పట్ల పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ సహకారం లేని కారణంగానే దేశంలో అనేక స్టార్టప్‌లు, కంపెనీలు మూతపడుతున్నాయి.