Dengue | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో డెంగ్యూ విజృంభిస్తోంది. గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ (Dengue) కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ వైరస్ కారణంగా వెస్ట్ ఇంఫాల్ జిల్లాలో ఓ మరణం కూడా సంభవించింది. సెప్టెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 448 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అందులో ఇంఫాల్ వెస్ట్ (Imphal West)లో అత్యధికంగా 259 కేసులు వెలుగు చూశాయి. ఇక ఇంఫాల్ ఈస్ట్ (Imphal East)లో 117 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సపమ్ రంజన్ సింగ్ (Sapam Ranjan Singh) కూడా ధ్రువీకరించారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టులో 148 కేసులు నమోదైనట్లు చెప్పారు. సెప్టెంబర్ 13 నాటికి ఆ సంఖ్య 230కి పెరిగిందన్నారు. డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. డెంగ్యూ నివారణకు ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఓ వ్యక్తికి డెంగ్యూ పాజిటివ్ తేలితే అతను ఉన్న 100 మీటర్ల పరిధిలో ఫాగింగ్ చేస్తున్నట్లు చెప్పారు.
అయితే, సమాజ భాగస్వామ్యం లేకుండా ఇన్ఫెక్షన్ను నియంత్రించడం కష్టమన్నారు. డెంగ్యూ దరిచేరకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూల కుండీలతోపాటు తమ ఇళ్లలో, చుట్టుపక్కల నీరు నిలవకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డెంగ్యూపై పోరాటంలో దోమల ఉత్పత్తి కేంద్రాలను నిర్మూలించడమే కీలకమని చెప్పారు.
ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. గతేడాది మణిపూర్ వ్యాప్తంగా 2,548 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఇంఫాల్ వెస్ట్‌లో 1,639 కాగా, ఇంఫాల్ ఈస్ట్‌లో 521 కేసులు నమోదయ్యాయి. అయితే అప్పుడు ఒక్క మరణం కూడా సంభవించలేదు.
Also Read..
Snake | రన్నింగ్ ట్రైన్లో పాము ప్రత్యక్షం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వైరల్ వీడియో
PM Modi | గూగుల్ టు ఎన్విడియా.. 15 టాప్ టెక్ సీఈవోలతో ప్రధాని మోదీ రౌండ్ టేబుల్ సమావేశం