Delhi | దేశ రాజధాని ఢిల్లీలో రాజిందర్‌నగర్ ఘటన అరంతరం ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలను నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చినట్లుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నియంత్రించేందుకు చట్టం తీసుకువస్తామన్నారు. అన్ని రకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్లు దీని పరిధిలోకి వస్తాయని తెలిపారు. మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల అర్హతలు, ఫీజుల నియంత్రణ, తప్పుదోవ పట్టించే ప్రకటనలను చట్టం ద్వారా అరికట్టనున్నట్లు తెలిపారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.
ఇందు కోసం ఓ కమిటీ వేస్తామని.. ఇందులో అధికారులే కాకుండా కోచింగ్ ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు సైతం ఉంటారన్నారు. చట్టంపై అభిప్రాయాలను తెలిపేందుకు ప్రత్యేకంగా ఈ-మెయిల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. Coaching.law.feedback@gmail.com మెయిల్‌కు అభిప్రాయాన్ని తెలుపాలని కోరారు. ప్రమాదంపై స్పందిస్తూ.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మురికి కాలువల్లోని నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. అలాగే బేస్మెంట్లో తరగతి గదులు, లైబ్రరీని నిర్వహించడం వందశాతం చట్టవిరుద్ధమన్నారు. బేస్మెంట్లో పార్కింగ్తో పాటు స్టోర్‌రూంగా వాడుకోవచ్చన్నారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎంసీడీ చర్యలు ప్రారంభించిందని.. దీనికి బాధ్యుతలైన జేఈని ఎంసీడీని నుంచి తొలగించారని.. ఏఈని సస్పెండ్ చేశారన్నారు. పూర్తి నివేదిక వచ్చాక ఇతర అధికారుల ప్రమేయం ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.