Rahul Gandhi | హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఇక్కడ హస్తం పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హర్యానా ఎన్నికల ఫలితాలపై (Haryana result) కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు.
హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియపై తమకు అందిన ఫిర్యాదుల గురించి ఎన్నికల కమిషన్కు తెలియజేస్తామన్నారు. ‘హర్యానాలో అనూహ్య ఫలితాలపై మేం విశ్లేషణ చేస్తున్నాం. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి గురించి ఎన్నికల సంఘానికి తెలియజేస్తాం. హర్యానాలో పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించిన కార్యకర్తలు, నేతలు.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది’ అని రాహుల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందలు చేస్తూ బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 చోట్ల కమలం పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసీ పనితీరుతోపాటు ఈవీఎంలపైనా ఆరోపణలు చేస్తున్నారు.
మరోవైపు జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఎన్సీ – కాంగ్రెస్ కూటమి 49 స్థానాల్లో జయకేతం ఎగురవేసింది. ఇందులో ఎన్సీ అత్యధికంగా 42 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 6, సీపీఎం 1 సీటును గెలుచుకుంది. బీజేపీ 29 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక్క దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన తర్వాత జరిగిన ఎన్నికలు ఇవే. జమ్ము ఎన్నికల ఫలితాలపై కూడా రాహుల్ స్పందించారు. ఈ మేరకు ఆ ప్రాంత ప్రజలకు హృతయమూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు రాజ్యాంగం సాధించిన విజయంగా అభివర్ణించారు.
Also Read..
Army jawans | ఇద్దరు జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. ఒకరు మృతి