సూర్యాపేట, మార్చి 8 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతి పెద్ద మున్సిపాల్టీగా పేరుపొందిన సూర్యాపేట పట్టణం నేడు సమస్యలతో సతమతమవున్నది. సూర్యాపేట మున్సిపాల్టీ విలీన గ్రామాలతో కలిపి మొత్తం 48వార్డులు ఉండగా ప్రస్తుతం ప్రతీ వార్డులో సమస్యలు పేరుకుపోయాయి. సంవత్సర కాలంగా పాలకవర్గం లేక పోవడం ప్రత్యేకాధికారుల పాలనలో స్థానిక ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యలను వార్డు అధికారులకు చె బితే వారు సంబంధిత సిబ్బందికి చెప్పడం, సంబంధిత సిబ్బంది పెడచెవిన పెట్టడంతో జ నం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్ర స్తుతం ఎన్నికైన కొత్త పాలకవర్గంపై జనం కోటి ఆశలు పెట్టుకున్నారు. వార్డుల్లో తిరుగుతున్న కొత్త పాలకవర్గ సభ్యులకు జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను కౌన్సిలర్లు, అధికారులకు చెబుదామంటే అధికారులు, సిబ్బంది ఫోన్లు ఎత్తడం లేదంటున్నారు.
ముఖ్యంగా సూర్యాపేట పట్టణ ప్రజలు శానిటేషన్, వీధిలైట్లు, మంచినీటి సమస్యతో అరిగోస పడుతున్నారు. పలు వార్డుల్లో పారిశుద్ధ్య సిబ్బంది సరిగా లేక మేజర్ కాల్వల్లో పూడిక తీయకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. అంతే కాకుండా ఆయా వార్డుల్లో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని మండు వేసవిలో సైతం ఎలాంటి లోటు లేకుండా గంటల పాటు అందజేయగా ప్రస్తుతం కేవలం 45 నిమిషాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా సన్నటి ధారతో రావడంతో జనం తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. గంటల పాటు వచ్చిన మంచినీరు నేడు 45 నిమిషాలే సన్నటి ధారగా రావడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే.. ఇలా ఉంటే మండు వేసవిలో మంచినీటి పరిస్థితి ఏమిటని స్థానికులు వాపోతున్నారు.
ఇటీవల మిషన్ భగీరథ ప్లాంట్ మరమ్మతుల కారణంగా నాలుగు రోజుల పాటు పట్టణానికి మంచినీటి సరపరా నిలిచిపోగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన మొరిశెట్టి నివేదిత ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేసినా.. దాంతో తాగునీరు తప్ప ఇతర అవసరాలు తీరడంలేదు. అలాగే శివారు కాలనీలతో పాటు పట్టణం నడిబొడ్డున ఉన్న వార్డు ల్లో వీధిలైట్లు వెలగక అంధకారం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ముందు ఆయా వార్డుల్లో కొన్ని వీధిలైట్లు వేసినప్పటికీ మరికొన్ని అవసరం ఉన్నాయి. ప్రస్తుతం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నడుస్తుండటం దీనికి తోడు వీధిలైట్లు వెలగక పోవడంతో ఎప్పుడు ఏ గుంతలో పడతామోనని జనం భయాందోళలు చెందుతున్నారు. వార్డు అధికారులు, ప్రజా ప్రతినిధులకు వార్డుల్లో వీధిలైట్లు కావాలని చెబుతున్నా సంబంధిత సిబ్బంది పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శానిటేషన్, వీధిలైట్లు, మంచినీటి సమస్యను గుర్తించి పరిష్కారదిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
సూర్యాపేటలోని 1,2,3, 4,5, 6, 8, 9, 10, 11, 12, 13 వార్డుల్లో విలీన గ్రామాలు ఉండటంతో ఆయా గ్రామాలు సూర్యాపేట పట్టణంలో కలిసి పోయాయి. గ్రామాలుగా ఉన్నప్పుడు తమ సొంత బడ్జెట్‌తో అభివృద్ధి చేసుకోగా పట్టణంలో కలిశాక సమస్యలు పరిష్కారం కాకపోగా.. రెట్టింపయ్యాయని ఆయా వార్డుల్లోని జనం వాపోతున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం శివారు కాలనీలపై ప్రత్యే క దృష్టి పెట్టి అభివృద్ధి చేసింది. అయితే గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ కాలనీలు అభివృద్ధిలో ఎంతో వెనుకబడ్డాయి. తమ వార్డుల్లో సమస్యలను విన్నవించినా పరిష్కరించే వారే లేరని వార్డుల్లోని జనం వాపోతున్నారు. వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేక పోవడంతో దోమల బెడద ఎక్కువైందని, వీధిలైట్లు వెలగడం లేదంటున్నారు. శివారు కాలనీలో మిషన్ భగీరథ నీరు సైతం సమయానికి రావడం లేదని, దీంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. శివారు కాలనీలకు ప్రత్యేక నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలి.
శివారు కాలనీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. నూతన పాలకవర్గం శివారు కాలనీలకు ప్రత్యేక నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలి. ఇందిరమ్మ 1, 2, 3 కాలనీల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉండడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివారు కాలనీల్లో రోడ్డు, డ్రైనేజీలు, వీధిలైట్ల సమస్యతో పాటు నల్లాలు సరిగా రావడం లేదు. శానిటేషన్ నిర్వహణ సక్రమంగా జరిగేలా సిబ్బందిని పెంచాలి.
మంచినీటి నల్లాలు గతంలో పెద్ద ధారతో వచ్చేవి. ప్రస్తుతం సన్నగా రావడంతో నీరు సరిపోవడం లేదు. గతంలో గంటపాటు వచ్చిన నల్లా నేడు ముప్పావు గంట మాత్రమే ఇస్తున్నారు. దీంతో మంచినీరు సరిపోవడంలేదు. ఇతర అవసరాలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నల్లా నీరు పెద్ద ధారతో వచ్చేలా చూడాలి. వేసవిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపడితే బాగుంటుంది.