సిటీబ్యూరో, మార్చి 8(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కొలిక్కి రాలేదు. నగర వ్యాప్తంగా అవుటర్ రింగు రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేస్తూ 10 రేడియల్ రోడ్లను హెచ్ఎండీఏ ప్లాన్ చేసింది. ఒకటి రావిర్యాల మీదుగా, మరొకటి కోకాపేట నుంచి వికారాబాద్ జిల్లాను అనుసంధానం చేస్తూ రెండు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ఇప్పటికీ ఈ రెండు ప్రాజెక్టులను భూసేకరణ సమస్యలు వేటాడుతూనే ఉన్నాయి. రావిర్యాల్(టాటా ఇంటర్‌ఛేంజ్) నుంచి రీజనల్ రింగు రోడ్డు ఆమంగల్ వరకు మొత్తం 41.50కిలోమీటర్ల పొడవైన రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1ను రూ. 4621 కోట్ల అంచనా వ్యయంతో హెచ్ఎండీఏ చేపడుతోంది.
రెండు దఫాలుగా నిర్మిస్తుండగా, తొలి దశలో 19.20 కిలోమీటర్లకు రూ. 1911 కోట్లు, రెండో దశలో 22.30 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు కోసం హెచ్ఎండీఏ రూ. 2710 కోట్లతో నిర్మించనున్నారు. ఇందులో రావిర్యాల్ టాటా ఇంటర్ ఛేంజ్ నుంచి మీర్ఖాన్పేట్ వరకు, మీర్ఖాన్పేట్ నుంచి ఆమంగళ్ వరకు తొలుత 6 లేన్ మెయిన్ కారేజ్ వేతోపాటు, మెట్రో, గ్రీన్ బెల్ట్, సైకిల్ ట్రాక్, పుట్‌పాత్, సర్వీస్ రోడ్లను నిర్మించనున్నారు. అదేవిధంగా కోకాపేట యోపోలిస్ నుంచి వికారాబాద్ జిల్లాలోని పరిగిని నిర్మించనున్న 52 కిలో మీటర్ల పొడవైన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ కోసం భూములు సేకరించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఇందులో ఏ ఒక్కటీ కూడా భూసేకరణ పూర్తి కాలేదు.
భూసేకరణ కష్టాలు
హెచ్ఎండీఏ చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు రెడ్ సిగ్నల్ పడుతున్నది. భూ సేకరణ ఇబ్బందులు, వందలాది ఎకరాల వ్యవసాయ భూములను రోడ్లుగా మార్చడంపైనే రైతుల నుంచి తీవ్ర విముఖత వ్యక్తమవుతున్నది. రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ పూనుకోవడంతో ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఇటీవల కోకాపేట నియోపోలిస్ నుంచి వికారాబాద్ జిల్లా పరిగి వరకు నిర్మించనున్న 52 కిలోమీటర్లపై పొడవైన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును రైతులు వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున్న రైతుల నుంచి వస్తున్న ప్రతిఘటన హెచ్ఎండీఏకు ఇబ్బందిగా మారుతున్నది.