వాషింగ్టన్ : ఇరాన్‌ను అణ్వాయుధాలు తయారుచేయకుండా అడ్డుకుంటామంటూ ఆ దేశంతో యుద్ధానికి దిగిన అమెరికా ఇప్పుడు ఖర్చులు భరించలేక బయటపడే మార్గాలను వెతుక్కుంటున్నది. అణు కేంద్రాలన్నింటినీ శాశ్వతంగా మూసివేయాలని, అణ్వాయుధాలు తయారు చేయబోమని పేర్కొంటూ తమతో ఒప్పందం చేసుకోవాలని ఇప్పటిదాకా ఒత్తిడి చేసిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు తోక ముడిచినట్టు తెలుస్తున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు ఒప్పందం కోసం ఒత్తిడి చేయడానికి బదులుగా హొర్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం పూర్తిగా పునరుద్ధరిస్తే యుద్ధానికి ముగింపు పలకాలని, అణు సమస్యను పక్కనపెట్టి విజయాన్ని ప్రకటించడానికి అమెరికా యంత్రాంగం సిద్ధంగా ఉండవచ్చని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం పేర్కొన్నది. కాగా, ఇరాన్ భారీ డిమాండ్లను ముందుకు తీసుకురావడంతో గౌరవప్రదమైన పరిష్కారాన్ని కనుగొనడం క్లిష్టంగా మారింది. వందల కోట్ల డాలర్ల చెల్లింపులు, అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగింపు, ఆ ప్రాంతం నుంచి అమెరికా బలగాల సంపూర్ణ ఉపసంహరణ, ఇతర కీలక రాయితీలను ఇరాన్ కోరుతున్నది. ఈ షరతులు అమెరికా దౌత్యపరమైన అవకాశాలను పరిమితం చేశాయి.