Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుఫానుగా (Cyclone Montha) బలపడినట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది. కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్లు, విశాఖకు ఆగ్నేయంగా 710 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రా కాకినాడ దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో గరిష్టంగా గంటకు 90-100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఒడిశా (Odisha), తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీలోని తీరప్రాంతాల్లోని బీచ్లు మూసివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విపత్తు ప్రతిస్పందన బృందాలు మోహరించారు.
మరోవైపు ఒడిశాలోని ఎనిమిది జిల్లాల్లో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మల్కాన్గిరి, కోరాపుట్, నబరంగ్పూర్, రాయగడ, గజపతి, గంజాం, కంథమల్, కలహండి.. జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు ప్రతిస్పందన బృందాలు మోహరించారు. అక్టోబర్ 27 నుంచి 29 వరకూ సముద్ర తీరాలకు పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ఒడిశా అంతటా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు అక్టోబర్ 30 వరకూ సెలవు ప్రకటించారు.
మొంథా తుఫాను నేపథ్యంలో అక్టోబర్ 27, 28 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరికి ఐఎండీ వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై, సమీప జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. చెన్నై, రాణిపేట్, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. విల్లుపురం, చంగల్పట్టు, పుదుచ్చేరిలో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
తుఫాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు (Hevy Rain) కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో 5 సెంటీమీటర్ల నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం జయశంకర్-భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. దీంతో ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో అక్కడకక్కడా, హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నెల 30వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని వెల్లడించింది.
Also Read..
Donkey Route | డంకీ రూట్లో ప్రవేశం.. 54 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా
Justice Surya Kant: తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదించిన సీజేఐ బీఆర్ గవాయ్
Actor Vijay | నెల రోజుల తర్వాత.. కరూర్ బాధితులను కలిసిన విజయ్