Crime news : ఆమె ఒక విద్యార్థిని (Female student). అతడు ఒక టీచర్ (Teacher). పిల్లలకు విద్యాబుద్ధులతోపాటు సంస్కారం నేర్పాల్సిన బాధ్యత అతడిది. కానీ అతడే సంస్కార హీనంగా ప్రవర్తించాడు. ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించాడు. వేగలేక ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో దారుణానికి ఒడిగట్టాడు. తుపాకీతో ఆమెను కిరాతకంగా కాల్చిచంపాడు. బీహార్ (Bihar) లోని సమస్తిపూర్ (Samastipur) జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సమస్తిపూర్ జిల్లాలోని పర్సా పంచాయతీకి చెందిన 19 ఏళ్ల గుడియా కుమారి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షలకు సిద్ధమవుతోంది. అదే ఏరియాలో నలందా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇవాళ (సోమవారం) గుడియా బహేరి బ్లాక్‌లోని కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా శివాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొథియాన్ గ్రామం వద్ద స్కూల్ టీచర్ ఆమెను అడ్డగించాడు.
‘నేను నిన్ను ప్రేమిస్తున్నా. నన్ను పెళ్లి చేసుకోవాలి’ అని ఆమెపై ఒత్తిడి చేశాడు. దాంతో ఎప్పటిలాగే ఆమె తాను ప్రేమించడంలేదని కరాకండిగా చెప్పింది. దాంతో అప్పటికే పథకం ప్రకారం తుపాకీతో వచ్చిన అతడు అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో గుడియా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
నిందితుడు పనిచేస్తున్న ప్రైవేట్ పాఠశాలకు నిప్పుపెట్టారు. అనంతరం సింఘియా-బహేరి-దర్భంగా ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని, ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. నిందితుడు తమ కుమార్తెను చాలాకాలంగా బెదిరిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని వారు కన్నీరుమున్నీరయ్యారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మర్టానికి తరలించామని చెప్పారు. పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నామని అన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.