Woman died : ఇంటి సమీపంలో ఆమెపై చెట్టుకొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమెను ఆస్పత్రి (Hospital) కి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ (Ambulance) లో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. గంటల తరబడి ట్రాఫిక్ క్లియర్ కాలేదు. దాంతో ఆ మహిళ నరకయాతన పడి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్ర (Maharastra) లోని పాల్ఘర్ జిల్లా (Palghar district) లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పాల్ఘర్ జిల్లాలోని మధుకర్ నగర్‌కు చెందిన 49 ఏళ్ల ఛాయా పూరవ్ అనే మహిళపై ఆమె ఇంటి సమీపంలోనే జూలై 31న చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆమె తలకు, పక్కటెముకలకు, భుజాలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే పాల్ఘర్ జిల్లాలో అత్యవసర చికిత్స అందించే ట్రామా కేర్ సెంటర్ అందుబాటులో లేదు. దాంతో స్థానిక వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం 100 కిలోమీటర్ల దూరంలో ముంబైలో ఉన్న హిందూజా ఆస్పత్రికి తరలించాలని సూచించారు.
సాధారణంగా అక్కడికి వెళ్లేందుకు రెండున్నర గంటల సమయం పడుతుంది. అందుకే వైద్యులు ఆమెకు ఆ సమయానికి సరిపడా అనస్థీషియా ఇచ్చి, మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంబులెన్స్ ఎక్కించారు. ఆమెతోపాటు ఆమె భర్త కౌశిక్ కూడా అంబులెన్స్‌లో బయలుదేరారు. అయితే జాతీయ రహదారి-48పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో సాయంత్రం 6 గంటలు అయినా అంటే మూడు గంటలు గడిచినా వారు ఆస్పత్రికి చేరుకోలేకపోయారు.
అప్పటికే అనస్థీషియా ప్రభావం తగ్గడంతో నొప్పులు భరించలేక ఆమె నరకయాతనపడింది. నన్ను తొందరగా ఆస్పత్రికి తరలించండి అంటూ రోదించింది. అప్పటికీ ట్రాఫిక్ జామ్ ఇంకా క్లియర్ కాకపోవడంతో రాత్రి 7 గంటలప్పుడు మార్గమధ్యలో మీరా రోడ్‌లోని ఆర్బిట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు చెప్పారు. అరగంట ముందుగా తీసుకొచ్చి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని వైద్యులు చెప్పారంటూ మృతురాలి భర్త కౌశిక్ కన్నీటి పర్యంతమయ్యారు.