Air India Flight : ఢిల్లీ-రాయ్‌పూర్ (Delhi-Raipur) ఎయిరిండియా విమానం (Air India flight) లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ చేరుకున్న విమానం ల్యాండ్ అయిన తర్వాత డోర్ తెరుచుకోలేదు. దాంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ఎమ్మెల్యే సహా 160 మంది ప్రయాణికులు గంటకుపైగా లోపలే చిక్కుకుపోయారు. ఆదివారం రాత్రి రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద (Swami Vivekananda) విమానాశ్రయం (Airport) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎయిరిండియాకు చెందిన AI 2797 విమానం ఆదివారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీలో బయలుదేరి రాత్రి 10.05 గంటలకు రాయ్‌పూర్‌కు చేరుకుంది. రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అనంతరం విమానం డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఆ విమానంలో బిలాస్పూర్ జిల్లా కోట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అటల్ శ్రీవాస్తవ కూడా ఉన్నారు.
దాదాపు గంటపాటు విమానం డోర్లు తెరుచుకోకపోవడం, సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. అదే సమయంలో విమానంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో వారి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరికి ఎయిర్‌లైన్స్ సిబ్బంది స్పందించారు. కేవలం సాంకేతిక లోపం కారణంగా డోర్ తెరుచుకోలేదని చెప్పారు. ఎట్టకేలకు రాత్రి 11.00 గంటల తర్వాత సాంకేతిక సమస్యను సరిచేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు.
కాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సోమవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఎయిరిండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం, ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వడంలో సిబ్బంది విఫలమవడం లాంటి ఘటనల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.