Suicide : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అతడు ముస్లిం, ఆమె క్రిస్టియన్. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమె ముస్లిం (Muslim) మతంలోకి మారాలని అతడు షరతు విధించాడు. అయితే ఆ షరతుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆమెను గదిలో బంధించి అతడు, అతడి కుటుంబం తీవ్రంగా కొట్టారు. అవమాన భారంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. కేరళ (Kerala) లోని కొత్త మంగళారం (Kothamangalaram) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్త మంగళారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పరవూర్‌కు చెందిన రమీస్, 23 ఏళ్ల సోనా ఎల్దోస్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. సోనా టీచర్ ట్రెయినింగ్ కోర్సు చదువుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమె ముస్లిం మతంలోకి మారాలని షరతు విధించారు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో ఒత్తిడి చేశారు.
అయినా మతం మారేందుకు ఆమె ససేమిరా అనడంతో ఓ గదిలో బంధించి రమీస్, అతడి కుటుంబం, బంధువులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రమీస్.. ఎక్కడైనా చావుపో అని తిట్టి పంపించాడు. దాంతో ఆమె తన ఇంటికి చేరుకుని, తాను చచ్చిపోతున్నానని అతడికి మెసేజ్ పెట్టింది. దాంతో సరే మంచిది కానియ్ అని అతడు రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలి గదిలో లభ్యమైన సూసైడ్ లెటర్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి వాట్సాప్ చాట్‌ను పరిశీలించగా.. ఆమె చనిపోతున్నానని మెసేజ్ చేయడం, అతడు ఓకే కానియ్ అని రిప్లై ఇవ్వడం కనిపించాయి. దాంతో మృతురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు పురికొల్పిన నేరం కింది రమీస్ను అరెస్ట్ చేశారు. లభ్యమయ్యే సాక్ష్యాధారాల ఆధారంగా ఇతర నిందితులను కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు చెప్పారు.