Crime news : పంటి వైద్యుడు (Dental doctor) అయిన ఓ అల్లుడు తన అత్తను చంపి 19 ముక్కలుగా కోశాడు. ఆ తర్వాత తలతో సహా ఇతర దేహభాగాలను 14 ప్లాస్టిక్ కవర్ల (Plastic covers) లో కుక్కి రోడ్డు పక్కన పడేశాడు. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు (Tumakuru) జిల్లా కొరటగెరె (Koratagere) పోలీస్స్టేషన్ పరధిలోని కోలాల (Kolala) గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కోలాల గ్రామంలో ఆగస్టు 7న రోడ్డు వెంట ఏడు ప్లాస్టిక్ కవర్లలో ఓ మహిళ శరీర అవయవాలు కుక్కిపడేసి ఉండటాన్ని బాటసారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆ ఏడు కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ తనిఖీ చేయగా మరో ఏడు కవర్లలో మహిళా దేహ భాగాలు కనిపించాయి.
ఓ చోట తల కూడా లభ్యమైంది. ఆ తల ఆధారంగా మృతురాలు కోలాల గ్రామానికే చెందిన 42 ఏళ్ల లక్ష్మీదేవిగా పోలీసులు గుర్తించారు. ఆమె పిల్లనిచ్చిన అల్లుడు, డెంటల్ డాక్టర్ అయిన రామచంద్రప్ప ఆమెను హత్యచేసినట్లు కనిపెట్టారు. అత్త ప్రవర్తన సరిగా లేకపోవడం, దాంతో తెలిసిన వాళ్లు మీ అత్త అలాంటిది, మీ అత్త ఇలాంటిది అని మాట్లాడటం రామచంద్రప్ప అవమానంగా భావించాడు.
ఎంత చెప్పినా అత్త తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో విసిగిపోయాడు. తన పరువు తీస్తోందని కుమిలిపోయాడు. చివరికి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తన స్నేహితులైన కేఎన్ సతీశ్, కేఎస్ కిరణ్ల సాయం తీసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.