Air India : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ (Delhi) నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC) కి నడిచే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి సర్వీసుల రద్దు అమల్లోకి వస్తుందని తెలిపింది. నిర్వహణాపరమైన కారణాలతోనే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తన ప్రకటనలో పేర్కొంది.
ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఎయిరిండియా తన ఫ్లీట్‌లోని 26 బోయింగ్ 787 విమానాలకు రెట్రోఫిటింగ్ పనులను గత నెలలో ప్రారంభించింది. ఈ ఆధునికీకరణ ప్రక్రియ 2026 చివరి వరకు కొనసాగనుంది. ఈ సమయంలో పలు విమానాలు సేవలకు అందుబాటులో ఉండవు. అయితే ఇతర సర్వీసులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకే ఈ మార్గంలో సేవలను నిలిపివేస్తున్నామని ఎయిరిండియా తెలిపింది.
ఇప్పటికే సెప్టెంబర్ 1 తర్వాత వాషింగ్టన్ డీసీకి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను సంప్రదించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిరిండియా హామీ ఇచ్చింది. ప్రయాణికుల ఇష్టప్రకారం ఇతర విమానాల్లో సీట్లు కేటాయించడం లేదా టికెట్ డబ్బును పూర్తిగా వాపసు చేయడం వంటి ఆప్షన్లు అందిస్తామని తెలిపింది. ఇదిలావుంటే, డైరెక్ట్ ఫ్లైట్ రద్దయినా ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిరిండియా పేర్కొంది.
తమ భాగస్వామ్య విమానయాన సంస్థలైన అలస్కా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ ద్వారా న్యూయార్క్ (జేఎఫ్‌కే), నెవార్క్ (ఈడబ్ల్యూఆర్), చికాగో, శాన్ ఫ్రాన్సిస్కోల మీదుగా వాషింగ్టన్ డీసీకి వన్-స్టాప్ విమాన సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని స్పష్టంచేసింది. ఉత్తర అమెరికాలోని టొరంటో, వాంకోవర్‌తో సహా మరో ఆరు నగరాలకు నాన్‌స్టాప్ సర్వీసులు కొనసాగుతాయని ఎయిర్ ఇండియా తెలిపింది.