Crime news : అతడు నవమాసాలు మోసి కన్న తల్లినే గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే గంటల తరబడి కూర్చుని కూనిరాగాలు తీశాడు. పిసివాడిలా ఇసుకతో ఆటలు ఆడాడు. ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం జశ్పూర్ జిల్లా (Jashpur district) లోని కున్కురి పట్టణం (Kunkuri town) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కున్కురి పట్టణంలో జీత్ రామ్ యాదవ్ అనే 28 ఏళ్ల యువకుడు తన తల్లి గులాబీ (59) తో కలిసి నివసిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జీత్ రామ్ ఒక్కసారిగా తన తల్లిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి శవం పక్కనే కూర్చుని పాటలు పాడాడు. ఇసుకతో ఆటలు ఆడుతూ వింతగా ప్రవర్తించాడు.
ఈ దృశ్యం చూసి షాక్కు గురైన స్థానికులు అతడి దగ్గరకు వెళ్లేందుకు భయపడ్డారు. ఒకరిద్దరు ప్రయత్నించగా చేతిలో ఉన్న గొడ్డలిని గాల్లో తిప్పుతూ బెదిరించాడు. దాంతో వాళ్లు కూడా వెనక్కి తగ్గారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైనా జీత్ రామ్ దాడికి ప్రయత్నించాడు. పోలీసులు సంయమనం పాటిస్తూ అతడిని మాటల్లోకి దించారు. దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి, చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవచ్చని అనుమానిస్తున్నారు.