Donald Trump : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి చాటింపు వేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యం లేదని భారత్ ఇప్పటికే పలుమార్లు చెప్పినా.. ట్రంప్ తీరు మాత్రం మారలేదు. రెండు దేశాల మధ్య యుద్ధం తానే ఆపానంటూ మళ్లీమళ్లీ చెప్పుకుంటున్నాడు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో తానే స్వయంగా భారత ప్రధానికి ఫోన్ చేశానని చెప్పారు.
వైట్‌హౌస్‌లో తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ ప్రస్తావన చేశారు. భారత్-పాకిస్థాన్‌లకు తాను ఫోన్ చేసి యుద్ధం ఆపానని అన్నారు. ఆ రెండు దేశాల ఘర్షణలు అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఆ ఘర్షణలను ఆపాలని కోరానన్నారు. లేదంటే భారత్, పాక్‌తో వాణిజ్యఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించినట్లు తెలిపారు. తాను విధించే భారీ టారిఫ్‌లతో ఇరువురికీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పానని, ఆ తర్వాత ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగిందని అన్నారు.