Nawab Malik | మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసింది. కిడ్నీ వ్యాధితో పాటు పలు సమస్యలతో బాధపడుతున్నానంటూ మాలిక్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ఉపశమనం కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆరోగ్య సమస్యలతో బాంబే హైకోర్టు బెయిల్‌ను నిరాకరించడంతో ఈ నెల 13న నవాబ్ మాలిక్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు.
బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించి బెయిల్‌ను మంజూరు చేసింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరులతో సంబంధాల కేసులో ఫిబ్రవరి 2022లో నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. గత ఎనిమిది నెలలుగా మాలిక్ ఆరోగ్యం క్షీణిస్తో్ందని.. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది అమిత్ దేశాయ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా.. కిడ్నీ సరిగా పని చేయడం లేదని సూచించే వైద్య నివేదికలు సూచించలేదని హైకోర్టు పేర్కొంది.