జైపూర్: ఒక కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగిన తర్వాత ఇద్దరు పిల్లలు మరణించారు. మరికొందరు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. (Cough Syrup Kills 2 Children) అయితే ఆ దగ్గు మందు సురక్షితమని నిరూపించేందుకు ప్రయత్నించిన డాక్టర్ ఆ సిరప్ తాగిన తర్వాత స్పృహ కోల్పోయాడు. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. కేసన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సమ్మేళన దగ్గు సిరప్‌ను ప్రభుత్వ హాస్పిటల్స్‌కు సరఫరా చేస్తున్నారు.
కాగా, సికార్ జిల్లాకు చెందిన 5 ఏళ్ల నితీష్‌కు దగ్గు, జలుబు వచ్చింది. ఆదివారం చిరానాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ ఆ దగ్గు సిరప్‌ను సూచించాడు. ఆ రాత్రి 11.30 గంటలకు నితీష్‌కు తల్లి ఆ దగ్గు మందు ఇచ్చింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎక్కిళ్లు రావడంతో ఆ బాలుడు మేల్కొన్నాడు. తల్లి ఇచ్చిన మంచి నీరు తాగి నిద్రపోయాడు. తెల్లవారేసరికి అచేతనంగా పడి ఉన్నాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
సెప్టెంబర్ 22న మల్హా గ్రామానికి చెందిన రెండేళ్ల సామ్రాట్ జాతవ్, సోదరి సాక్షి, కజిన్ విరాట్ దగ్గు, జలుబు వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. కేసన్ ఫార్మా కంపెనీ దగ్గు సిరప్ మధ్యాహ్నం వేసుకోగా ఆ ముగ్గురు పిల్లలు ఐదు గంటల తర్వాత కూడా మేల్కోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సాక్షి, విరాట్‌ను కదిలించగా లేచిన తర్వాత వాంతులు చేసుకున్నారు. స్పృహలో లేని సామ్రాట్‌ను తొలుత స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత జైపూర్‌లోని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ చిన్నారి మరణించాడు.
మరోవైపు సెప్టెంబర్ 24న బయానాకు చెందిన 3 ఏళ్ల గగన్ కుమార్‌కు దగ్గు సిరప్ ఇచ్చిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. హెల్త్ సెంటర్ డాక్టర్ తారాచంద్ యోగిని బాలుడి తల్లి నిలదీసింది. అయితే ఆ దగ్గు మందు సురక్షితమని నిరూపించేందుకు ఆ డాక్టర్ దానిని తాగాడు. అంబులెన్స్ డ్రైవర్ రాజేంద్రకు కూడా ఇచ్చాడు.
ఆ తర్వాత కారులో భరత్‌పూర్‌కు బయలుదేరిన డాక్టర్ తారాచంద్ రోడ్డు పక్కన కారు ఆపి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మొబైల్‌ను ట్రాక్ చేసిన కుటుంబ సభ్యులు ఎనిమిది గంటల తర్వాత కారులో పడి ఉన్న ఆ డాక్టర్‌ను గుర్తించి హాస్పిటల్‌కు తరలించారు. అంబులెన్స్ డ్రైవర్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స తర్వాత కోలుకున్నాడు.
కాగా, గత వారం రోజులుగా బన్స్వారా జిల్లాలో ఐదేళ్ల వయస్సులోపు ఎనిమిది మంది పిల్లలు కూడా ఈ దగ్గు సిరప్ తాగిన తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. ఈ సంఘటనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన 22 బ్యాచ్‌ల దగ్గు సిరప్‌ను నిషేధించింది. వాటి పంపిణీ నిలిపివేసింది. ఆ దగ్గు సిరప్‌ను సూచించవద్దని డాక్టర్లను కోరింది. అయితే ఈ ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకు 1.33 లక్షల బాటిళ్ల దగ్గు సిరప్‌ను పలు జిల్లాల రోగులకు అందించినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.
Also Read:
Teen Sneak Into Girlfriend’s House | ప్రియురాలిని కలిసేందుకు గోడ దూకిన యువకుడు.. విద్యుదాఘాతంతో మృతి
Netanyahu Apology To Qatar | ట్రంప్ ఒడిలో ఫోన్.. ఖతార్‌కు నెతన్యాహు క్షమాపణ