భోపాల్: కిడ్నీ వైఫల్యం వల్ల 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మరణించారు. (Children Dies Of Kidney Failure) ఆ చిన్నారులు వినియోగించిన రెండు రకాల దగ్గు సిరప్లు విషపూరితమైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం వాటిని నిషేధించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పరాసియా, న్యూటన్ చిక్లి, సమీప గ్రామాలకు చెందిన ఐదేళ్ల లోపు పిల్లలు జ్వరం, జలుబు, దగ్గు బారిన పడ్డారు. స్థానిక డాక్టర్లు జ్వరం మందులతోపాటు దగ్గు సిరప్లు రాశారు. వాటిని వాడిన పిల్లలు కొద్దిగా కోలుకున్నారు. ఆ తర్వాత వారిలో కిడ్నీ సమస్యలు తలెత్తాయి.
కాగా, మెరుగైన చికిత్స కోసం కొందరు పిల్లలను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు చిన్నారులు మరణించారు. సెప్టెంబర్ 7 నుంచి 20 వరకు 15 రోజుల్లో మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కారణంగా ఆరుగురు పిల్లలు చనిపోయారు. కిడ్నీ బయాస్పీలో షాకింగ్ విషయం బయటపడింది. ఔషధ విష ప్రయోగానికి సంబంధించిన విషపూరిత రసాయనం డైథిలిన్ గ్లైకాల్ కారణంగా చిన్నారుల కిడ్నీలు పాడైనట్లు నిర్ధారణ అయ్యింది.
మరోవైపు బాధిత చిన్నారులు ఎక్కువగా కోల్డ్రిఫ్, నెక్స్ట్రో-డీఎస్ దగ్గు సిరప్లు వినియోగించినట్లు అధికారుల దర్యాప్తులో తెలిసింది. దీంతో చింద్వారా కలెక్టర్ శీలేంద్ర సింగ్ అప్రమత్తమయ్యారు. ఆ రెండు రకాల దగ్గు సిరప్‌ల అమ్మకాలను జిల్లా అంతటా నిషేధించారు. డాక్టర్లు, మందుల షాపులతో పాటు ప్రజలను అలెర్ట్ చేశారు. ప్రభావిత గ్రామాల నీటి నమూనాలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదని కలెక్టర్ తెలిపారు. చిన్నారుల మూత్రపిండాల వైఫల్యానికి కలుషిత ఔషధం కారణమన్నది బయాప్సీ నివేదిక బలంగా సూచిందని వెల్లడించారు.
కాగా, మరింత మంది చిన్నారులు కిడ్నీ సమస్యల బారిన పడటంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బృందాన్ని జిల్లా యంత్రాంగం పిలిపించింది. భోపాల్ ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం కూడా పరాసియా, న్యూటన్ చిక్లి, సమీప గ్రామాలను సందర్శించారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. దగ్గు మందు, ఇతర ఔషధ నమూనాలను సేకరించారు.
మరోవైపు ప్రభావిత పిల్లలను గుర్తించేందుకు వైద్య అధికారులు ఆయా గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. పిల్లల రక్తం, ఔషధ నమూనాలను పూణేలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కు ఐసీఎంఆర్ బృందం పంపింది. కాగా, తమకు న్యాయం చేయాలని పిల్లలను కోల్పోయిన బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read:
Elephant Theft | ఏనుగు చోరీపై వ్యక్తి ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Girl Kidnapped, Raped | బాలికను కిడ్నాప్ చేసి ఆరు నెలలుగా అత్యాచారం.. రక్షించిన పోలీసులు
Watch: ఫుడ్ డెలివరీ బాయ్‌కు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?