Cloudburst : ఉత్తరాఖండ్ జలప్రళయంతో అక్కడికి వెళ్లిన 28 మంది పర్యాటకుల బృందం గల్లంతైంది. ఆ బృందంలోని వారిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన వారు కాగా, మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా తెలిసింది. వారిలో ఓ దంపతులకు చెందిన బంధువు మీడియాతో మాట్లాడుతూ.. తాను వారితో మాట్లాడి ఒకరోజు గడిచిందన్నారు.
తాము మాట్లాడినప్పుడు వారు ఉత్తరకాశీ నుంచి ఉదయం 8.30కు గంగోత్రికి బయల్దేరినట్లు వెల్లడించారని ఆయన తెలిపారు. ఆ తర్వాత వారి మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయని, ఆ తర్వాత నుంచి వారితో ఎలాంటి కాంటాక్టు లేదని చెప్పారు. ఫోన్లలో బ్యాటరీ అయిపోయిందా, లేదంటే వారున్నచోట సిగ్నల్ లేదా, మరేదైనా జరిగిందా అనేది అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తంచేశాడు.
అతడు చెప్పిన వివరాల ప్రకారం.. హరిద్వార్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ 10 రోజులపాటు ఉత్తరాఖండ్ ట్రిప్ ఏర్పాటు చేసింది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ధరాలీ కీలకమైన స్టాప్. అదేసమయంలో మంగళవారం అక్కడ భారీగా మెరుపు వరద విరుచుకుపడింది. క్షణాల్లో భవనాలు మట్టి కింద కూరుకుపోయాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. డజన్ల మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి జాడ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.