CJI Sanjiv Khanna | భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా (CJI Sanjiv Khanna) నేడు పదవీ విరమణ చేయనున్నారు. డీవై చంద్రచూడ్ పదవీ విరమణతో ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా 2024 నవంబర్‌లో ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆరు నెలలు మాత్రమే సేవలందించారు. నేటితో ఆయన పదవీ కాలం ముగిసింది. దీంతో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ (Justice BR Gavai) రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
పలు కీలక తీర్పుల్లో భాగస్వామి
జస్టిస్ సంజీవ్ ఖన్నా.. న్యూఢిల్లీలో 1960, మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్ర్తాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత జడ్జి అయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల వినియోగాన్ని ఆయన సమర్థిస్తూ.. అవి పూర్తి భద్రమైనవని, దాని వల్ల బోగస్ ఓట్లు, బూత్‌ల రిగ్గింగ్‌ను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. అలాగే ఎలక్టోరల్ బాండ్లపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఖన్నా కూడా ఉన్నారు. 370 అధికరణ రద్దును సమర్థిస్తూ తీర్చు ఇచ్చిన ధర్మాసనంలో కూడా ఆయన సభ్యుడే.
తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్..
కాగా తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ పేరును సీజేఐ ఖన్నా ఏప్రిల్ 16న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సీజేఐగా ఆరు నెలలకుపైగా కొనసాగుతారు. 2025 నవంబర్ 23న ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కావడం విశేషం.
పలు కీలక తీర్పులు..
గవాయ్ పూర్తిపేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమ్రావతిలో జన్మించిన జస్టిస్ గవాయ్.. 1985 మార్చి 16న బార్లో సభ్యుడిగా చేరారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనేక చరిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మాసనాలలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు. పూర్వ జమ్మూ కశ్మీరు రాష్ర్టానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు. రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు.
రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజారిటీతో ఆమోదించిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ పాత్ర ఉంది. ఎస్సీల వర్గీకరణ చేపట్టేందుకు రాష్ర్టాలకు అధికారాలను అందచేస్తూ 6:1 మెజారిటీతో తీర్పును వెలువరించిన ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ ఉన్నారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ ముఖ్యమైన తీర్పును వెలువరిస్తూ 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏ ఆస్తినీ కూల్చరాదని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు జారీచేసింది. అడవులు, వన్యప్రాణులు, చెట్ల పరిరక్షణకు సంబంధించిన అంశాలను విచారించే ధర్మాసనాలకు ఆయన సారథ్యం వహిస్తున్నారు.
Also Read..
Subbanna Ayyappan | కావేరీ నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్
Ethanol: ఆన్లైన్లో ఇథనాల్ కొన్నారు.. నీళ్లు కలిపి అమ్మారు.. కల్తీ మద్యం కేసులో నిజాలు
Operation Sindoor: అదంపూర్ ఎయిర్‌బేస్‌కు మోదీ.. సైనికులతో మాట్లాడిన ప్రధాని