అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కల్తీ మద్యం తాగిన కేసులో 15 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ విషాద ఘటనకు చెందిన కొన్ని చేదు నిజాలు బయటకు వచ్చాయి. కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్న ప్రబ్జిత్ సింగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ కేసుకు చెందిన విషయాలను ఎస్ఎస్పీ మణిందర్ సింగ్ మీడియాకు వెల్లడించారు. నిందితుడు ప్రభ్‌జిత్ సింగ్.. ఆన్లైన్లో సుమారు 50 లీటర్ల ఇథనాల్(Ethanol) కొన్నాడని, ఆ తర్వాత నీళ్లు కలిపి దాన్ని 120 లీటర్ల కల్తీ మద్యంగా మార్చినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో కుల్బీర్ సింగ్, సాహబ్ సింగ్, గుర్జాంత్ సింగ్, నిందర్ కౌర్‌లను అరెస్టు చేశారు.
సాహెబ్ సింగ్ అనే వ్యక్తి ఇథనాల్‌ను ఆన్లైన్లో ప్రొక్యూర్ చేశారని ఎస్ఎస్పీ తెలిపారు. ఆ తర్వాత దాన్ని బస్సులు, కొరియర్ సర్వీసుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసినట్లు చెప్పారు. అయితే ఆన్లైన్లో ఇథనాల్ అమ్ముతున్న కంపెనీలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేసినట్లు చెప్పారు.
అమృత్సర్ చుట్టు పక్కల గ్రామాల్లో కల్తీ మద్యం తాగిన బాధితులకు ప్రభుత్వం చికిత్స అందిస్తున్నది. కల్తీ సారా తాగి విష లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని శిరోమని అకాలీ దళ్ నేత బిక్రమ్ సింగ్ మజీత తెలిపారు.