Sheeshmahal | ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘శీష్ మహల్’ (Sheeshmahal) వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు శీష్ మహల్ (Sheesh Mahal) పునరుద్ధరణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాపై వస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది (Centre Orders Probe).
కేంద్ర ప్రజాపనుల విభాగం నివేదిక సమర్పించిన తర్వాత ఫిబ్రవరి 13న సమగ్ర విచారణకు ఆదేశించింది. 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్లో 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ఆధునీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వివరణాత్మక నివేదిక తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది.
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పని చేసిన సమయంలో సివిల్ లైన్స్‌లో ఆయన అధికారిక నివాసం ఏర్పరుచుకున్నారు. అయితే, ఆ నివాసాన్ని బీజేపీ ‘శీష్ మహల్’గా అభివర్ణిస్తోంది. ఢిల్లీ సీఎం అధికార నివాసాన్ని దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు ఆరోపిస్తోంది. ఆధునీకరణంలో భాగంగా టాయిలెట్లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్ జరిగిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది.
మరోవైపు ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. 70 స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మనీశ్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ వంటి కీలక నేతలు సైతం ఓటమి పాలవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కీలక నేతల్లో ఆప్ సీఎం ఆతిశీ ఒక్కరే గెలుపొందడం కాస్త ఊరటనిచ్చింది. ఈ క్రమంలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తినలో కాషాయ జెండా ఎగిరింది. ఇక ఈనెల 19 లేదా 20 తేదీల్లో ఢిల్లీకి కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. నూతన సీఎం ఈ బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించుకుంది.
Also Read..
Ranveer Allahbadia: అల్లబదియా ముంబై ఫ్లాట్ లాక్.. మళ్లీ సమన్లు ఇచ్చిన పోలీసులు
Deportation | రాత్రి 10 గంటలకు అమృత్‌సర్‌కు అక్రమ వలసదారుల విమానం.. ఈసారి ఎంతమంది వస్తున్నారంటే?
Punjab | పంజాబ్‌లోనే ఎందుకు?.. అక్రమ వలసదారుల విమానాలు దిగడంపై వివాదం