తెలుగు యూనివర్సిటీ, మార్చి 7: సంగీతం, సాహిత్యాలలో విశేషసేవలందిస్తున్న లబ్ధప్రతిష్టులకు ప్రదానం చేసే పురస్కారాలను శాంతా వసంతా ట్రస్టు శనివారం ప్రకటించింది. పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ వరప్రసాద రెడ్డి ఆధ్వర్యంలోని శాంతా వసంతా ట్రస్టు విశిష్ట సేవలు అందించిన ముగ్గురికి పురస్కారాలను అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోడూరు ప్రభాకరరెడ్డికి డాక్టర్ వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం, ప్రముఖ వక్త, సాహితీవేత్త సుధామకు కోడూరు వెంకటరమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారానికి, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు డి.వి మోహనకృష్ణకు వసంతా వరప్రసాదరెడ్డి సంగీతరత్న పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ట్రస్టు ఒక ప్రకటనలో తెలిపింది.
ఆబిడ్స్ బొగ్గులకుంట తిలక్రోడ్డులో గల తెలంగాణ సారస్వత పరిషత్తు ఆడిటోరియంలో ఈ నెల 15న ఉదయం 10గంటలకు సాహితీవేత్తలకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. పురస్కారం కింద ఒక్కొక్కరికీ లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు.