Deportation | అక్రమ వలసదారులపై (Deportation) ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సంకెళ్లేసి మరీ వారిని స్వదేశాలకు పంపిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మందిని ఇటీవల సైనిక విమానంలో పంపించిన విషయం తెలిసిందే. రెండో విడుతగా నేడు మరో 119 మంది భారత్‌కు రానున్నారు. శనివారం రాత్రి 10.05 గంటలకు సీ-17 యూఎస్ మిలిటరీ విమానం అమృత్‌సర్‌లో దిగనుంది. వారిలో అత్యధికంగా పంజాబ్‌కు చెందినవారే ఉన్నారు. 67 మంది పంజాబీలు ఉండగా, హర్యానా 33 మంది, గుజరాత్ 8 మంది, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందినవారు ఇద్దరు చొప్పున, గోవా, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. తొలుత రెండు విమానాల్లో వలసదారులు రానున్నట్లు పేర్కొన్నప్పటికీ.. ప్రస్తుతానికి ఒకటి మాత్రమే వస్తున్నది. రెండో విమానంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, ప్రతివారం అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధికారులు వెల్లడించారు. వీరంతా డంకీ రూట్, ఇతర మార్గాల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు పేర్కొన్నది.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను వెనక్కు రప్పించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఎవరైనా అక్రమంగా వేరే దేశంలోకి ప్రవేశించి, నివసించే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మానవ అక్రమ రవాణా వ్యవస్థపైనే పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ రెండు రోజులపాటు అమెరికాలో పర్యటించిన విషయం తెలిందే. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రంప్ అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా, తనకు భారతదేశ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.
అమెరికాలో మొత్తం 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉండగా, అందులో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా. మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత భారతీయులే అధికం. ఇప్పటికే ఆ దేశ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు 18 వేల మంది భారతీయుల లిస్టును తయారు చేసినట్టు బ్లూమ్‌బర్గ్ న్యూస్ తెలిపింది. సుమారు 20,407 మంది భారతీయులకు సరైన పత్రాలు లేవని, వారిలో 17,940 మందిని పంపించి వేయడానికి జాబితా సిద్ధంగా ఉందని వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 2,467 మంది అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం శిక్ష అనుభవిస్తూ అక్కడి నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు.
అమెరికా నుంచి తిరిగి వస్తున్న అక్రమ వలసదారుల విమానాలు దిగడానికి పంజాబ్‌ను ఎంచుకోవడంపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా కేంద్ర ప్రభుత్వ చర్యలను ఘాటుగా విమర్శిస్తున్నాయి. ఇదంతా ఉద్దేశపూర్వకంగా పంజాబ్‌ను అపఖ్యాతిపాలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నమా? అని మాన్ నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్న సమయంలో, అమెరికా అధికారులు మనవారికి సంకెళ్లు వేసి ఉంటారని, ఇది మోదీకి ట్రంప్ ఇచ్చిన బహుమతా? అని ప్రశ్నించారు. ఈ విమానాలు దిగడానికి అమృత్సర్ను ఎంపిక చేయడంలో ఏ విధానాన్ని అనుసరించారో విదేశీ వ్యవహారాల శాఖ చెప్పాలన్నారు.
ఈ నెల 5న వచ్చిన మొదటి విమానాన్ని అహ్మదాబాద్‌లో ఎందుకు దించలేదని ప్రశ్నించారు. దానిలో వచ్చినవారిలో అత్యధికులు గుజారాతీలేనన్నారు. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పల్ సింగ్ చీమ మాట్లాడుతూ, ఈ విమానాలు పంజాబ్‌లోనే దిగేలా చేయడం ద్వారా రాష్ర్టాన్ని అపఖ్యాతిపాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నదని మండిపడ్డారు. ఈ విమానాలు హర్యానా, గుజరాత్ రాష్ర్టాలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా ఇదే విధంగా స్పందించింది.