హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 130 బీసీ కులాలు ఉన్నా, ఓబీసీ జాబితాలో మాత్రం 90 కులాలకే గుర్తింపు ఇచ్చారని, మిగతా 40 కులాలను కూడా ఆ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ కోరింది. ఆ తర్వాతే రాష్ట్రంలో జనగణన కార్యక్రమాన్ని చేపట్టాలని, లేదంటే బీసీల జనాభా తక్కువగా నమోదవుతుందని తెలిపింది. ఈ క్రమంలో తక్షణం కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. బుధవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ప్రకటన విడుదల చేశారు. జనగణన కార్యక్రమం మే 11 నుంచి జూన్ 9 వరకు కొనసాగనున్నదని, ఆ తర్వాత 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 గణన నిర్వహిస్తారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అన్ని బీసీ కులాలను కేంద్రం నిర్దేశించిన ఓబీసీ జాబితాలో చేర్చలేదని, తద్వారా రాష్ట్రంలో బీసీ కులాల సంఖ్యను తకువగా చూపెట్టే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. మిగతా 40 కులాలను ఓబీసీ లిస్ట్‌లో చేర్చాలని కేంద్రానికి ఇప్పటికే కోరామని, కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, 40 బీసీ కులాలను ఓబీసీ లిస్ట్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావుకు సూచించారు.