గుమ్మడిదల, జూలై 26: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారంలో 261 సర్వే నంబర్ చుట్టూ భూవివాదం రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతున్నది. దశాబ్దాలుగా నమోదైన భూరికార్డులు, సీలింగ్ చట్టం కింద ప్రభుత్వానికి అప్పగించిన భూములు, మాజీ సైనికోద్యోగులకు, పేద రైతులకు జరిగిన పంపిణీలు, పరిశ్రమల కొనుగోళ్లు తాజాగా టీజీఐఐసీ నోటీసులు.. ఇవన్నీ కలిసి స్థానికుల్లో తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. 261 సర్వే నంబర్ మొత్తం 588.07 ఎకరాలు.. ఇందులో 315 ఎకరాలు పట్టాభూములు కాగా, 273 ఎకరాలు భూసీలింగ్ చట్టం కింద ప్రభుత్వానికి అప్పగించిన భూములు.. ఈ 273 ఎకరాల్లో 1991లో 44 మంది మాజీ సైనికులకు 132.18 ఎకరాలు కేటాయించగా తరువాత 92 మంది పేద రైతులకు 117 ఎకరాలు పంపిణీ చేసినట్టు రికార్డులు చెప్తున్నాయి. స్థానికుల వాదన ప్రకారం పేదలకు వాస్తవంగా 66 ఎకరాలే అప్పగించగా మిగిలిన 51 ఎకరాల ఆచూకీ ఇప్పటికీ స్పష్టంగా లేదని ఆరోపిస్తున్నారు.
92 ఎకరాల ఖరీజు భూములు ఎక్కడ ఉన్నాయి.. ఇక ఈ పంపిణీ చేసిన భూముల్లోనే 66 ఎకరాలను టీజీఐఐసీ ఇండస్ట్ట్రియల్ పార్కు కోసం భూసేకరణకు ప్రాథమిక నోటీసులు జూన్ 18న జారీ చేయడం కొత్త చర్చకు తెరలేపింది. అదే సీలింగ్ భూముల్లో ఇందిరమ్మ ఇండ్లకు 16 ఎకరాలు, కేసీఆర్ కాలనీకి 5 ఎకరాలు, డంపింగ్ యార్డుకు 3 ఎకరాలు, శ్మశానవాటికకు ఎకరా, ఈద్గా కోసం10 గుంటలు కేటాయించినట్టు తెలుస్తున్నది. వీటన్నింటి తర్వాత కూడా సీలింగ్ భూముల్లో సుమారు 142.10 ఎకరాలపై స్పష్టత లేకపోవడం స్థానికులను అయోమయానికి గురిచేస్తున్నది. మరో వైపు 315 ఎకరాల పట్టా భూముల్లో ఒక ప్రముఖ పరిశ్రమ.. ఆలేటి వీరారెడ్డి నుంచి 35 ఎకరాలు, ఆలేటి శాంతవర్మారెడ్డి నుంచి 35 ఎకరాలు కలిపి 70 ఎకరాలు కొనుగోలు చేసినట్టు రికార్డులు సూచిస్తున్నాయి. అదే పరిశ్రమ మాజీ సైనికుల నుంచి సుమారు 58.31 ఎకరాలు కొనుగోలు చేశామని పేర్కొనడం వివాదానికి కారణమైంది. కొంతమంది మాజీ సైనికులకు అలాట్ చేసిన కొంత భూ కేటాయింపులను రెవెన్యూ అధికారులు గతంలోనే రద్దు చేసినట్టు సమాచారం.
ఇప్పటివరకు తమకు భూమి స్వాధీనం (పొజిషన్) ఇవ్వలేదని కొంతమంది మాజీ సైనికులు వాపోతున్నారు. అలాంటప్పుడు ఆ భూములు ఎలా విక్రయించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బినామీ పేర్లతో బై నంబర్లతో భూములు కొనుగోలు చేసి ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నా రు. పరిశ్రమ నిర్మిస్తున్న ప్రహరీని స్థానికుల ఫిర్యాదుతో మున్సిపల్ కమిషనర్ ఇటీవల కూల్చివేయడం మరింత చర్చనీయాంశమైంది. ఇదిలావుండగా టీజీఐఐసీ భూసేకరణ నోటీసులు వెలువడటంతో రైతుల్లో కొత్త ఆందోళన మొదలైంది. తమకు గతంలో పంపిణీ చేసిన భూములకే ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై వారు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం స్థానికులు, రైతులు, ప్రజాప్రతినిధులు ఒకే ప్రశ్న వేస్తున్నారు. 261వ సర్వే నంబర్లో అసలు ప్రభుత్వ భూమి ఎంత? పంపిణీ చేసిన భూమి ఎంత? ఆక్రమణలు ఎక్కడ జరిగాయి? రికార్డులోని ఎకరాలు.. భౌతికంగా ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు జిల్లా, మండల రెవెన్యూ అధికారులపై ఉన్నది. ఈ విషయమై మున్సిపల్ కౌన్సిలర్లు తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమగ్ర సర్వే, రికార్డుల పరిశీలన, భౌతిక ధ్రువీకరణ చేపట్టి నిజానిజాలు వెలికి తీస్తేనే రైతులు, మాజీ సైనికులు, లబ్ధిదారులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.