హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రైతులు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు ఇచ్చే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతు కమిషన్ చైర్మన్ ఏ కోదండరెడ్డి కోరారు. ప్రభుత్వ సలహాదారుడు పీ సుదర్శన్‌రెడ్డితో కలిసి రైతు కమిషన్ చైర్మన్, సభ్యులు బుధవారం పటాన్‌చెరులోని ఇక్రిశాట్లో సాగుచేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా తకువ నీటితో సాగుచేస్తున్న జొన్న, వేరుశనగ , శనగ, కంది, ఇతర తృణధాన్య పంటలను పరిశీలించి, శాస్తవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంటల మార్పిడిలో భాగంగా వరికి బదులు శనగ, వేరుశనగ, మిల్లెట్లు వంటి వాటిని ప్రోత్సహించాలని అన్నారు. ఇక్రిశాట్ను సందర్శించిన సందర్భంగా పలు అంశాలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక అందిస్తామని తెలిపారు.