Punjab | అమృత్సర్ : అమెరికా నుంచి తిరిగి వస్తున్న అక్రమ వలసదారుల విమానాలు దిగడానికి పంజాబ్‌ను ఎంచుకోవడంపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా కేంద్ర ప్రభుత్వ చర్యలను ఘాటుగా విమర్శిస్తున్నాయి. ఇదంతా ఉద్దేశపూర్వకంగా పంజాబ్‌ను అపఖ్యాతిపాలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నమా? అని మాన్ నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్న సమయంలో, అమెరికా అధికారులు మనవారికి సంకెళ్లు వేసి ఉంటారని, ఇది మోదీకి ట్రంప్ ఇచ్చిన బహుమతా? అని ప్రశ్నించారు. ఈ విమానాలు దిగడానికి అమృత్సర్ను ఎంపిక చేయడంలో ఏ విధానాన్ని అనుసరించారో విదేశీ వ్యవహారాల శాఖ చెప్పాలన్నారు.
ఈ నెల 5న వచ్చిన మొదటి విమానాన్ని అహ్మదాబాద్‌లో ఎందుకు దించలేదని ప్రశ్నించారు. దానిలో వచ్చినవారిలో అత్యధికులు గుజారాతీలేనన్నారు. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పల్ సింగ్ చీమ మాట్లాడుతూ, ఈ విమానాలు పంజాబ్‌లోనే దిగేలా చేయడం ద్వారా రాష్ర్టాన్ని అపఖ్యాతిపాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నదని మండిపడ్డారు. ఈ విమానాలు హర్యానా, గుజరాత్ రాష్ర్టాలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా ఇదే విధంగా స్పందించింది. కాగా, 119 మంది భారత వలసదారులతో కూడిన మరో విమానం శనివారం అమెరికా నుంచి అమృత్‌సర్‌కు చేరుకోనుంది.