PM Modi | దేశ ప్రగతి గురించే ఎప్పుడూ తమ ఆలోచనలు ఉంటాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్’ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి దీన్ని ఆశించడం తప్పిదమే అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని, మనందరికీ ముందుకు సాగే మార్గాన్ని చూపించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
‘దేశ ప్రగతి గురించే ఎప్పుడూ మా ఆలోచనలు ఉంటాయి. పేద ప్రజల అభ్యున్నతి కోసమే మా కార్యక్రమాలు ఉంటాయి. పదేళ్లుగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాం. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నాం. ప్రజలు మమ్మల్ని మూడుసార్లు విశ్వసించారు. ఫ్యామిలీ ఫస్ట్ అన్నది కాంగ్రెస్ సిద్ధాంతం. నేషన్ ఫస్ట్ అనేది మా విధానం. దేశానికి ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించాలి. ఇంతపెద్ద దేశంలో మాకు మూడోసారి అవకాశం దక్కిందంటే మా అభివృద్ధిని ప్రజలు అర్థం చేసుకున్నారు. అభివృద్ధి దిశగానే మా ప్రభుత్వ పథకాలన్నీ ఉంటాయి. మా హయాంలో సమయమంతా దేశ ప్రగత కోసం వినియోగిస్తున్నాం. దేశంలో చివరి వ్యక్తికి సంక్షేమం అందించడం మా లక్ష్యం’ అని మోదీ తెలిపారు.
‘సుదీర్ఘ కాలంపాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించింది. అంతపెద్ద పార్టీ ఒక కుటుంబానికే పరిమితమైంది. ప్రజల కళ్లకు గంతలు కట్టి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అందుకే ఆ పార్టీలో సబ్ కా సాత్.. సబ్కా సాత్ వికాస్ సాధ్యం కాదు. దశాబ్దాలుగా ఓబీసీలు నిరాశలో కూరుకుపోయారు. ఓబీసీల ప్రతిపాదనలను కాంగ్రెస్ తిరస్కరించింది. ఓబీసీల ఇబ్బందులు, కష్టాలు మేం విన్నాం. ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారి కోసం 10 శాతం రిజర్వేషన్లు తెచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇబ్బంది లేకుండా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఓబీసీలు కూడా స్వాగతించారు. దివ్యాంగుల కోసం ఎన్నో ఉపాధి కల్పన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ట్రాన్స్ జెండర్లకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం. చరిత్రాత్మకమైన నారీశక్తి వందన్ చట్టం కూడా చేశాం. కొత్త పార్లమెంట్ భవనంలో తొలి నిర్ణయం.. నారీ శక్తి గురించే’ అని మోదీ పేర్కొన్నారు.
‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు. ఎన్నికల్లో ఆయన్ని ఓడించేందుకు అనేక కుట్రలు చేసింది. అందుకు ఏం చేయకూడదో అన్నీ చేసింది. భారతరత్న ఇవ్వకుండా అవమానించారు. కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, అవినీతి. చరిత్రలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ తప్పులే కనిపిస్తాయి’ అని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read..
Indian immigrants | బహిష్కరణ ప్రక్రియ కొత్తేమీ కాదు.. నిబంధనల ప్రకారమే సంకెళ్లు : జై శంకర్
Indian immigrants | కాళ్లకు, చేతులకు సంకెళ్లతో భారత వలసదారులు.. వీడియో
Chandrayaan-4 | చంద్రయాన్-4 కీలక ప్రకటన..! 2027లో మిషన్ చేపడుతామన్న కేంద్రమంత్రి..!