Bomb threats | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు (Delhi schools) శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు.
ద్వారకా సెక్టార్ 16లోని ఆంధ్రాస్కూల్, సీఆర్పీఎఫ్ స్కూల్, నజాఫ్‌గఢ్‌లోని సంత్ దర్శన్ పబ్లిక్ స్కూల్, గోయిలా డెయిరీలోని శాంతి జ్ఞాన్ నికేతన్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలల ప్రాంగణాల్లో పేలుడు పదార్థాలను అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, సిబ్బందిని బయటకు పంపి పాఠశాలల ప్రాంగణాలను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, గత కొంతకాలంగా దేశంలోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖులకు, హైకోర్టులకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఢిల్లీ నగరంలోని వందకు పైగా పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే, అవన్నీ నకిలీ బెదిరింపుగా తేల్చారు.
Also Read..
Suicide Attacks | ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి ప్లాన్.. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
Artificial Rain | ఈ నెల 29న ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. ఎందుకంటే..?
Air Pollution | కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. క్లౌడ్ సీడింగ్‌కు ఏర్పాట్లు