హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ పాలన పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుపుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. హైడ్రా ముసుగులో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలి పేదల ఇండ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. హైదరాబాద్, రామగుం డం, మహబూబ్‌నగర్, ఖమ్మం తదితర ప్రాం తాల్లో హైడ్రా పేరిట విధ్వంసం సాగిస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో దివ్యాంగుల గూళ్లు, వెలుగుమట్లలో నిరుపేదల గుడిసెలను కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. మూసీ బ్యూటిఫికేషన్, గాంధీ సరోవర్ ప్రాజెక్టుల పేరిట అపార్ట్మెం ట్లు, పక్కా ఇండ్లను నేలమట్టం చేసేందుకు యత్నించడం శోచనీయమని పేర్కొన్నారు.
రాష్ట్రానికి వచ్చుడు వెళ్లుడేనా?
తెలంగాణకు రావడం, వెళ్లడం తప్ప ఇక్కడి గందరగోళ పరిస్థితులను ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్‌ను ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని ఏటీఎంగా వాడుకోవడం తప్ప ఇచ్చిన వాగ్దానాలపై ముఖ్యమంత్రి, మంత్రులకు సూచనలు ఎందుకు చేయడం లేదు? ఉత్తరప్రదేశ్, బీహార్ వెళ్లినప్పుడే బుల్డోజర్ రాజ్యం గుర్తుకొస్తుందా? తెలంగాణలో కొనసాగుతున్న విధ్వంస పాలన కనిపించడం లేదా? రెండు లక్షల ఉద్యోగ హామీపై సమీక్షించాల్సిన బాధ్యతలేదా?’ అని నిలదీశారు.
రాహుల్జీ వెలుగుమట్లకు వెళ్లండి
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేండ్లుగా జీవిస్తున్న పేదలపై రేవంత్ సర్కార్ ప్రతాపం చూపడం బాధాకరమని వద్దిరాజు పేర్కొన్నారు. నిలువనీడలేక, ఆకలితో అలమటిస్తున్న బాధితులను బీఆర్ఎస్ తరుఫున ఆదుకోవడాన్ని చూసి ఓర్వలేని పాలకులు పోలీసులను అడ్డుపెట్టుకొని దాడులకు దిగడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. గూడును కోల్పోయి అంబేద్కర్ భవన్లో తలదాచుకున్న పేదలను తరిమికొట్టేందుకు యత్నించడం శోచనీయమని మండిపడ్డారు. తెలంగాణకు వచ్చిన రాహుల్‌గాంధీ వెలుగుమట్లను సందర్శించి అక్కడి దయనీయ పరిస్థితుల గురించి తెలుసుకోవాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో పార్టీ నాయకులు గెల్లు శ్రీనివాస్, గాంధీనాయక్, బొమ్మెర రామ్మూర్తి, కురువ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.