Artificial Rain | నవంబర్ వచ్చిందంటే చాలు ఢిల్లీ వాసులకు దడే. రాజధాని ప్రాంతంలో ఏటా అక్టోబర్ చివరి నుంచే వాయు కాలుష్యం (air pollution) గరిష్ఠ స్థాయికి చేరుతుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఈసారి కూడా దీపావళికి ముందే వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగానే నగరంలో కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు సీఎం రేఖాగుప్తా నిన్న ప్రకటించారు. వాతావరణం అనుకూలిస్తే ఈనెల 29న ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ (cloud seeding)కు అవకాశముందని తెలిపారు. బురారి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్ష సక్సెస్ అయినట్లు చెప్పారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందన్నారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వెదర్లో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్ధాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోయి.. పర్యావరణం క్లీన్ అవుతుంది.
Also Read..
Air Pollution | కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. క్లౌడ్ సీడింగ్‌కు ఏర్పాట్లు
Kurmool Bus Accident | కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సుపై 16 చలాన్లు
PM Modi | ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి