Black box | అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు మొదలైంది. దర్యాప్తులో ఎంతో కీలకమైన బ్లాక్ బాక్స్ (Black box) గురించి ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదని ఎయిర్ ఇండియా (Air India) సంస్థ స్పష్టం చేసింది.
‘విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం అందించే బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదు. దొరికినట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలు మాత్రమే’ అని ఎయిర్ ఇండియా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికిందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై సంస్థ స్పష్టతనిచ్చింది. ఈ బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదానికి గల కారణాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విమానం వెనుక భాగంలో ఇది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విమానం బిల్డింగ్ శిథిలాల్లో చిక్కుకుపోయింది. దీంతో బ్లాక్ బాక్స్‌ను తీయడం కష్టంగా మారింది.
అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా (Air India) బోయింగ్ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్కరు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ విమానం హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్‌పై కూలడంతో మరో 24 మంది మెడికోలు మృత్యువాతపడ్డారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది మృతి చెందారు.
విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ కీలకం..
విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ కీలకం అన్న విషయం తెలిసిందే. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. విమానం, హెలికాప్టర్ల ప్రమాదం జరిగేకంటే కనీసం రెండు గంటల ముందు ఏం జరిగిందన్న వివరాలను ఈ బ్లాక్‌బాక్స్ స్టోర్ చేసుకుంటుంది. విమానాలు క్రాష్ అయినా ఇందులోని సమాచారం తొలగిపోదు. ప్రమాదానికి గల కారణం, ప్రమాదానికి ముందు ఏం జరిగింది.. తదితర సమాచారం అంతా ఈ బ్లాక్ బాక్సులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. భవిష్యత్తు ప్రమాదాలను నిరోధించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read..
Ahmedabad Plane Crash | ప్రాణాలతో ఎలా బయటపడ్డానో నాకే తెలియదు.. విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు
PM Modi | విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ.. క్షతగాత్రులకు పరామర్శ