Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్కరు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడటం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందన్నారు.
‘నేను ప్రమాదం నుంచి ఎలా సజీవంగా బయటపడ్డానో నాకే తెలియదు. ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. కొద్దిసేపు నేను చనిపోయాననే అనుకున్నా. కానీ కళ్లు తెరిచి చూడగా.. బతికే ఉన్నా. నేను మెల్లగా నా సీటు బెల్టు తీసి అక్కడి నుంచి బయటకు వచ్చా. నా ముందు ఉన్న ఎయిర్ హోస్టెస్, ప్రయాణికులు చనిపోయి ఉన్నారు. కొన్ని క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. నేను గ్రౌండ్ ఫ్లోర్‌కు దగ్గరగా ఉన్నా. అక్కడ కొంత స్థలం ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చా. భవనం గోడ ఎదురుగా ఉండటంతో ఎవరూ బయటకు రాలేకపోయారు’ అంటూ తాను బయటపడ్డ తీరు గురించి వివరించారు. ఇక ప్రమాదం ఎలా జరిగిందని అడగ్గా.. ‘టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత.. విమానం గాల్లో స్ట్రక్ అయినట్లు అనిపించింది. అప్పుడు గ్రీన్, వైట్ లైట్లు పడ్డాయి. పైలట్లు విమానాన్ని పైకి లేపేందుకు ప్రయత్నించగా.. అది వేగంగా వెళ్లి భవనంపై కూలిపోయింది’ అని చెప్పుకొచ్చారు.
ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు రమేశ్..
బ్రిటిష్ జాతీయుడైన (British national ) 38 ఏండ్ల రమేశ్ విమానంలో 11ఏ సీటులో కూర్చున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వెనుక ఈ సీటు ఉంటుంది. తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్‌కు వచ్చిన రమేశ్ తన సోదరుడు అజయ్ కుమార్ రమేశ్(45)తో కలసి లండన్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. విమానంలోని 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకే భారీ శబ్దం వినిపించిందని, అంతలోనే విమానం కూలిపోయిందని తెలిపాడు. అంతా క్షణాలలో జరిగిపోయింది అని రమేశ్ చెప్పుకొచ్చారు.
ప్రమాదంలో రమేశ్‌కు ఛాతీ, కళ్లు, కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి. అంతకుముందు, విమానం కూలిపోయి దగ్ధమవుతుండగా గాయపడిన రమేశ్ అంబులెన్సు వైపు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానంలో ఇతర ప్రయాణికుల పరిస్థితి గురించి స్థానికులు రమేశ్‌ను అడగడం కనిపించింది. విమానం పేలిపోయింది అని గుజరాతీలో రమేశ్ చెప్పడం వినిపించింది.
11ఏ సీటు ప్రత్యేకతలు
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8(డ్రీమ్‌లైనర్స్)లో 11ఏ సీటు ఎకానమీ క్లాస్ క్యాబిన్‌కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది. బిజినెస్ క్లాస్‌కి వెనుక ఉంటుంది. క్యాబిన్‌కి అభిముఖంగా కూర్చుని చూస్తే ఎడమ వైపున 11ఏ సీటు ఉంటుంది. విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి రెండు వరుసల ముందు ఈ విండో సీటు ఉంటుంది. ప్రమాద సమయాలలో సురక్షిత సీటుగా పరిగణించే 11ఏ సీటు ఎమర్జెన్సీ డోర్‌కు వెనుకనే ఉంటుంది.
Also Read..
PM Modi | అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృత్యుంజయుడిని పరామర్శించిన ప్రధాని మోదీ
మృత్యుంజయుడు.. విమాన దుర్ఘటన నుంచి బయటపడ్డ లండన్‌వాసి.. 11ఏ సీటు ఎందుకు ప్రత్యేకం