అహ్మదాబాద్, జూన్ 12: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా బోయింగ్ ఏ-171లో ప్రయాణిస్తున్న 242లో ఒకరైన రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. బ్రిటిష్ జాతీయుడైన 38 ఏండ్ల రమేశ్ విమానంలో 11ఏ సీటులో కూర్చున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వెనుక ఈ సీటు ఉంటుంది. తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్‌కు వచ్చిన రమేశ్ తన సోదరుడు అజయ్ కుమార్ రమేశ్(45)తో కలసి లండన్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
విమానంలోని 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు. అసర్వాలోని ప్రభుత్వ దవాఖాన జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రమేశ్‌ను మీడియా పలకరించగా తాను ఘోరమైన ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పారు. టేకాఫ్ అయిన 30 సెకండ్లకే భారీ శబ్దం వినిపించింది. అంతలోనే విమానం కూలిపోయింది. అంతా క్షణాలలో జరిగిపోయింది అని రమేశ్ చెప్పారు.
రమేశ్‌కు ఛాతీ, కళ్లు, కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి. అంతకుముందు, విమానం కూలిపోయి దగ్ధమవుతుండగా గాయపడిన రమేశ్ అంబులెన్సు వైపు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఓ వీడియోలో కనిపించాయి. విమానంలో ఇతర ప్రయాణికుల పరిస్థితి గురించి స్థానికులు రమేశ్‌ను అడగడం కనిపించింది. విమానం పేలిపోయింది అని గుజరాతీలో రమేశ్ చెప్పడం వినిపించింది.
ఇతర ప్రయాణికుల గురించి అడిగిన ప్రశ్నకు వారంతా అక్కడ (ప్రమాద స్థలిలో) ఉన్నారు అని రమేశ్ చెప్పారు. విమాన ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. 11ఏ సీటులో సజీవంగా ఉన్న ఓ ప్రయాణికుడిని పోలీసులు గుర్తించారు. ఆ ప్రయాణికుడు దవాఖానలో చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య గురించి ఇప్పుడే తాను చెప్పలేనని మాలిక్ అన్నారు.
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8(డ్రీమ్‌లైనర్స్)లో 11ఏ సీటు ఎకానమీ క్లాస్ క్యాబిన్‌కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది. బిజినెస్ క్లాస్‌కి వెనుక ఉంటుంది. క్యాబిన్‌కి అభిముఖంగా కూర్చుని చూస్తే ఎడమ వైపున 11ఏ సీటు ఉంటుంది. విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి రెండు వరుసల ముందు ఈ విండో సీటు ఉంటుంది. ప్రమాద సమయాలలో సురక్షిత సీటుగా పరిగణించే 11ఏ సీటు ఎమర్జెన్సీ డోర్‌కు వెనుకనే ఉంటుంది.